బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఓటమికి కేటీఆరే కారణం

  • కేసీఆర్‌‌‌‌‌‌‌‌ కనిపిస్తలేడని కేసు పెట్టాలి

  • మంత్రి కొండా సురేఖ

  • గజ్వేల్‌‌‌‌‌‌‌‌లో మార్కెట్‌‌‌‌‌‌‌‌ కమిటీ ప్రమాణ స్వీకారం, హాజరైన మంత్రులు తుమ్మల, పొన్నం

గజ్వేల్, వెలుగు : ‘కేటీఆర్‌‌‌‌‌‌‌‌ చర్యల కారణంగానే బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఓడిపోయింది.. అప్పటి నుంచి ఆయనకు మతిభ్రమించింది.. కేటీఆర్‌‌‌‌‌‌‌‌ ప్రతిపక్షంగా ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయాలి’ అని మంత్రి కొండా సురేఖ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం గురువారం స్థానికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ హాజరయ్యారు. ముందుగా గజ్వేల్‌‌‌‌‌‌‌‌ ఏఎంసీ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా వంటేరు నరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, వైస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా సర్దార్‌‌‌‌‌‌‌‌ఖాన్‌‌‌‌‌‌‌‌తో పాటు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌, బీజేపీ చీకటి ఒప్పందం వల్లే మెదక్‌‌, కరీంనగర్‌‌‌‌‌‌‌‌ ఎంపీ స్థానాలు కోల్పోయామన్నారు. తన బిడ్డను జైలు నుంచి విడిపించుకునేందుకే ఎంపీ స్థానాలు బీజేపీకి వచ్చేలా కేసీఆర్‌‌‌‌‌‌‌‌ చూశారని విమర్శించారు.

 తాము ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంటే.. కేటీఆర్‌‌‌‌‌‌‌‌ మాత్రం పదవుల కోసం ఆరాటపడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో పిచ్చి పిచ్చి రాతలు రాస్తూ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల టైంలో ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా ప్రజలు నమ్మకుండా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పట్టం కట్టి, రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డిని సీఎం చేశారన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు రోజుకు 18 గంటలు పనిచేస్తూ గ్యారంటీలను అమలు చేస్తున్నామన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఒక్కసారి కూడా అసెంబ్లీలో అడుగుపెట్టడం లేదన్నారు. ‘గజ్వేల్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే కేసీఆర్‌‌‌‌‌‌‌‌ కనిపిస్తలేడు.. కేసీఆర్‌‌‌‌‌‌‌‌ అసలు ఉన్నాడా ? లేడా ? ఉంటే ఎక్కడున్నాడు ? అనే విషయాలు తెలుసుకునేందుకు పోలీస్‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌లో కేసు పెట్టాలి’ అని మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి సూచించారు. ‘కేటీఆర్‌‌‌‌‌‌‌‌కు అసలే పదవీ కాంక్ష ఎక్కువ.. ఇందుకోసం తండ్రి గొంతు పిసికి చంపేసిండేమో’ అన్న అనుమానం కలుగుతుందన్నారు. హైడ్రా, మూసీపై కేసీఆర్‌‌‌‌‌‌‌‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మూసీ ప్రక్షాళనను మొదలుపెట్టిందే బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పార్టీ అని చెప్పారు. కార్యక్రమంలో సిద్దిపేట డీసీసీ ప్రెసిడెంట్, గజ్వేల్‌‌‌‌‌‌‌‌ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, మత్స్య సహకార సంఘం అద్యక్షుడు మెట్టు సాయి, నాయకులు చిట్టి దేవేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, నరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.

రైతు రుణమాఫీ పూర్తి చేస్తాం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

రైతులు, అనుబంధ సంస్థలు ఇబ్బందులు పడకుండా, వ్యవసాయం సాఫీగా సాగాలన్న ఉద్దేశంతోనే రుణమాఫీ చేస్తామన్న హామీ ఇచ్చినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. మొదటి విడతలో రూ. 18 వేల కోట్లను మంజూరు చేశామని, మిగిలిన రైతులకు కూడా రుణమాఫీ పూర్తి చేస్తామన్నారు. ఎలాంటి నష్టం లేని పామాయిల్‌‌‌‌‌‌‌‌ పంట వైపు రైతులు దృష్టి సారించాలని సూచించారు. ఆయిల్‌‌‌‌‌‌‌‌ పామ్‌‌‌‌‌‌‌‌ సాగు, మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌కు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రైతులకు చేస్తున్న పనులను అభినందించకున్నా సరే కానీ కాళ్లలో కట్టె పెట్టే పనులు చేయొద్దని ప్రతిపక్షానికి సూచించారు. 

సలహాలు ఇవ్వమంటే ఇస్తలేరు : పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌
పదేండ్లు సీఎంగా చేసిన కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను సలహాలు ఇచ్చేందుకు రమ్మంటే ఆయనే వస్తలేడని మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ అన్నారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌, బీజేపీ తీరు ఢిల్లీలో దోస్తానా.. గల్లీలో కొట్లాట అన్నట్లుగా సాగుతుందన్నారు. రైతులు నష్టపోకుండా ఈ నెల 1వ తేదీ నుంచే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. సన్న, చిన్నకారు రైతులకు ఉపయోగపడేలా యాంత్రీకరణ కార్యక్రమం అమలు చేయాలని వ్యవసాయ శాఖామంత్రిని కోరుతున్నానన్నారు.