ఎన్నికల సిబ్బందికి హోటల్​ మెనూ ఇదే.. ఈసీ ఆదేశాలు జారీ

 ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బందికి  ఆహారం అందించాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. ముందుగా సిబ్బంది ఈ నెల 12న ఎన్నికల సామగ్రితో వారికి కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు సమోసా, మజ్జిగ, 5 గంటలకు మజ్జిగ లేదా నిమ్మరసం అందిస్తారు. రాత్రి 7 నుంచి 8 గంటల మధ్యలో భోజనం (అన్నం, కూర, చపాతీ, టమాటా పప్పు, పెరుగు, చట్నీ) అందిస్తారు.

పోలింగ్‌ రోజు 13న ఉదయం 6 గంటలకు టీ, రెండు అరటి పండ్లు, 8 నుంచి 9 మధ్య క్యారట్‌, టమాటాతో కూడిన ఉప్మా, పల్లీల చట్నీ, 11, 12 గంటల సమయంలో మజ్జిగ పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం (కోడిగుడ్డు కూర, ఓ కూరగాయ, చట్నీ, సాంబారు, పెరుగు) అందిస్తారు. మధ్యాహ్నం 3, 4 గంటల సమయాల్లో మజ్జిగ లేదా నిమ్మరసం పంపిణీ చేస్తారు. 5.30కి టీ, బిస్కెట్లు అందిస్తారు. ఇవన్నీ స్థానికంగా తయారు చేయించి, వేడివేడి ఆహారపదార్థాలను ఫ్రెష్‌గా వడ్డించాలని సంభందిత అధికారులకు  ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి 15 మంది సిబ్బంది చొప్పున మెనూ ప్రకారం అల్పాహారం, భోజనం అందించాలని ఆదేశించారు.  అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఫ్యాన్లు, అవసరమైతే కూలర్లు ఏర్పాటు చేయనున్నారు.

పోలింగ్‌ విధులకు వెళ్లాలంటేనే ఉద్యోగులు బెంబేలెత్తుతారు. ఎలాగైనా పోలింగ్‌ విధులు కేన్సిల్‌ చేయించుకోవడానికి చేయని ప్రయత్నాలంటూ ఉండవు. దీనికి కారణం ఊరుకాని ఊరికి ఎన్నికల విధులకు వెళ్లే సిబ్బంది కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. సమయానికి సరైన భోజనం ఉండదు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి, మనశ్శాంతిగా కునుకుతీయడానికి ఏమాత్రం అవకాశంలేక ఉక్కబోత, దోమల మోతతో రేయంతా జాగారం చేసి తెల్లారగానే పోలింగ్‌ విధులు నిర్వహించడం పరిపాటి. ఇక సిబ్బందికి సరైన భోజనంకాని, టిఫిన్స్‌కాని గగనమే. బిస్కెట్‌ ప్యాకెట్లు, టీతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. దీనితో ఎన్నికల విధులంటేనే ఉద్యోగులు హడలిపోయే పరిస్థితి. అయితే ఈసారి సార్వత్రిక ఎన్నికలలో పోలింగ్‌ సిబ్బంది కష్టాలు చాలావరకూ తీరనున్నాయి.