ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దాదాపుగా వచ్చేశాయి. ఒక్క పంజాబ్ మినహాయిస్తే.. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించింది. అయితే ఎన్నికల విజయోత్సవ సంబరాలపై ఎన్నికల కమిషన్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ నిషేధం ఎత్తివేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. విజయోత్సవ ర్యాలీలు, సభలు, సమావేశాలుకు అనుమతి ఇచ్చింది. గోవా,మణిపూర్,ఉత్తరాఖండ్,యూపీ, పంజాబ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే సమయానికి కరోనా కేసుల సంఖ్య భారీగా ఉండేది. దీంతో ఎన్నికల అధికారులు బహిరంగ సభలు, సమావేశాలపై బ్యాన్ విధించారు. కేవలం వర్చువల్ ర్యాలీలు, మీటింగ్లకు మాత్రమే అనుమతి ఇచ్చారు.
అయితే ఇప్పుడు కరోనా దాదాపు కంట్రోల్ అయ్యింది. రాష్ట్రాల్లో వందలోపే కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా కూడా కరోనా నిబంధనల్ని సడలించారు. అన్నింటికి అనుమతులు కల్పించారు. నైట్ కర్ఫ్యూలను కూడా రాష్ట్రాలు ఎత్తేశాయి. కరోనా కంట్రోల్‌లో ఉండటంతో ఇప్పుడు ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో అభ్యర్థులు గెలుపు సంబరాలు చేసుకోవచ్చని ఈసీ పేర్కొంది. ఆయా రాష్ట్రాల అధికారులు, స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఇచ్చిన ఆదేశాలు ఆయా రాష్ట్రాలు పాటించాల్సి ఉంటుందని ఈసీ పేర్కొంది.
