ఏపీ ఎన్నికల్లో సూపర్ హిట్ అయిన జనసేనకు గుడ్ న్యూస్. ఇప్పటి వరకు ఆ పార్టీకి పర్మినెంట్ గుర్తు లేదు. అయితే ఇక గాజుగ్లాసు గుర్తును ఎన్నికల కమిషన్ జనసేనకు శాశ్వత గుర్తుగా కేటాయించనుంది. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు రానున్నాయి. రాజకీయ పార్టీలకు శాశ్వత గుర్తు పొందాలంటే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో 6 శాతం ఓట్లు రావాలి. లేదా రెండు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ సీటు రావాలి. జూన్ 4న వెల్లడైన ఏపీ ఫలితాల్లో జనసేన 21 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే..
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లోజనసేన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు గెలిచారు. టీడీపీ, బీజేపీతో పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాల్లో జనసేన పోటీ చేయగా మొత్తం సీట్లలో విజయం సాధించింది. పిఠాపురం నుంచి బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్.. వైసీపీ నుంచి కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీతపై 70,729 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పార్టీ ఏర్పాటు చేసిన పదేండ్ల తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పీకే గెలుపు అంతా ఈజీ కాదని అందరూ అన్నప్పటికి.. ప్రభుత్వంపై వ్యతిరేకత, కాపు ఓట్లు, యూత్, మహిళల ఓట్లు వంటి అంశాలు పవన్ విజయంలో కీలక పాత్ర పోషించాయి. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం స్థానాల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాగా.. మచిలీపట్నం లోక్సభ సెగ్మెంట్ నుంచి బాలశౌరి 2.20 లక్షలు, కాకినాడ నియోజకవర్గం నుంచి ఉదయ్ శ్రీరామ్ 2.29లక్షల మెజారిటీతో గెలుపొందారు. 21 సీట్లు రావటంతో రెండు లేదా మూడు కేబినెట్ పదవులు, విప్, కార్పొరేషన్ పదవులు, ఎమ్మెల్సీలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.. పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించడం ఆనందంగా ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. దేశంలో ఏ పార్టీ కూడా పోటీ చేసిన ప్రతి చోటా 100 శాతం విజయాన్ని ఇప్పటిదాకా అందుకోలేదని తెలిపారు.