ఎన్నికల తాయిలాలు సిద్ధం చేసిన వైసీపీ - అధికారులకు టీడీపీ ఫిర్యాదు

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో పార్టీలన్నీ ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. ప్రచారంలో భాగంగా ఓటర్లను ఆకర్షించేందుకు భారీగా తాయిలాలలు కూడా సిద్ధం చేస్తున్నాయి పార్టీలు. ఈ క్రమంలో వైసీపీ సిద్ధం చేసిన తాయిలాలను స్వాధీనం చేసుకోవాలంటూ అధికారులకు టీడీపీ శ్రేణులు ఫిర్యాదు చేశారు. రేణిగుంటలో ఓ గోడౌన్లో వైసీపీ శ్రేణులు నిల్వ ఉంచిన తాయిలాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు.చంద్రగిరి ఎమ్మెల్యే, ఒంగోలు వైసిపి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి చెందిన గోడౌన్ నుంచి వస్తువులను సరఫరా చేస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు తరలించగా.. మంగళవారం మిగిలినవాటిని తీసుకెళ్లే క్రమంలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారి సలోనికి సమాచారం అందింది. సామగ్రిని తీసుకెళ్తున్న లారీని ఆమె తన బృందంతో కలిసి పట్టుకున్నారు. 

ఇదే సమయంలో అక్కడే ఉన్న గోడౌన్లో లో భారీ ఎత్తున సామగ్రితోపాటు డబ్బులు ఉంచినట్లు తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి నరసింహయాదవ్‌తో పాటు కార్యకర్తలు ఆరోపించారు. వెంటనే గోదాం తెరవాల్సిందిగా డిమాండ్‌ చేశారు. పంచనామా నిర్వహించేందుకు అధికారులు రేణిగుంట తహసీల్దారుకు సమాచారమిచ్చినా.. అయిదు గంటల తరువాత ఆయన అక్కడికి చేరుకున్నారు. ఎట్టకేలకు రాత్రి 8 గంటల సమయంలో గోడౌన్ తెరిచారు.


గోడౌన్లో లో మొత్తం 52 వస్తువులను అధికారులు గుర్తించారు. ఓటర్లకు పంచేందుకు బొట్టు బిళ్లలు, ఫొటో కీచైన్లు, చేతి గడియారాలు, సెల్‌ఫోన్‌ స్టాండ్లు, టీషర్టులు, గొడుగులు, చీరలు, మైక్‌సెట్లు వంటివి ఉన్నాయి. వీటితోపాటు సీఎం జగన్‌మోహన్‌రెడ్డితోపాటు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మోహిత్‌రెడ్డిల ఫొటోలున్న సంచులు పెద్దసంఖ్యలో ఉన్నాయి. కొంతమేర వైసిపు ఎన్నికల ప్రచార సామగ్రి కూడా లభించింది. ఏ నియోజకవర్గానికి ఏయే తేదీల్లో తాయిలాలు పంపించారనే వివరాలు ఒక పుస్తకంలో నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.