వైసీపీకి షాకిచ్చిన ఈసీ...మంత్రి, ఎమ్మెల్సీకి నోటీసులు..

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయం వేడెక్కుతోంది. ప్రధాన పార్టీల నేతలంతా ప్రచారం చేస్తూ జనంలోకి వెళ్లటంతో విమర్శలు ప్రతి విమర్శలతో రాష్ట్రం రణరంగంగా మారింది. ఈసారి ఎన్నికలను ఈసీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రమంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ను పకడ్బందీగా అమలు చేస్తోంది. ఈ క్రమంలో వైసీపీ మంత్రి జోగి రమేష్, పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి నోటీసులు జారీ చేసింది.

టీడీపీ అధినేత చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన కారణంగా టీడీపీ చేసిన ఫిర్యాదు మేరకు ఈసీ ఇద్దరికీ వేరువేరుగా నోటీసులు జారీ చేసింది.ఈ కేసుకు సంబంధించి 48గంటల్లోగా వివరణ ఇవ్వాలని జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డిని ఆదేశించింది ఈసీ. ఈసీ నిర్ణయించిన డెడ్ లైన్ లోగా వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ఎన్నికల సంఘం.