ఎన్నికల కోడ్ ఎఫెక్ట్‌.. అంతకు మించి మీ వద్ద ఒక్క రూపాయి ఎక్కువ ఉన్న సీజ్

పెళ్లైనా, పేరంటమైనా…. వాహన కొనుగోలు అయినా…. లేదా బ్యాంకుల్లో జమ చేయడానికైనా…. మీరు 50వేలకు మించి పట్టుకొని  తిరగొద్దు. తిరిగితే మీ డబ్బు ఖతమే…. అవును ఇది నిజమే.లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. జూన్ 6తో కోడ్ పూర్తవుతుంది.. అంటే మొత్తం 80 రోజుల పాటు రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమలులో ఉంటుంది. రాష్ట్రంలో మే 13న ఎన్నికలు పూర్తయినప్పటికీ, ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. 

లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో నగదు, ఇతర విలువైన వస్తువుల తరలింపులో  అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. తగు అనుమతులు, డాక్యుమెంట్లతోనే నగదు తరలింపు చేపట్టాలని సూచిస్తున్నారు. రూ.50 వేలకు మించి నగదు తరలింపునకు అనుమతులు లేకపోతే దాన్ని సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. 

పట్టణాలు, మండలాల సరిహద్దుల్లో పోలీస్ లు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఇక నుంచి ఆధారాలు లేకుండా రూ. 50వేలకు మించి డబ్బు మీ దగ్గరుంటే సీజ్ చేసేస్తారు. తర్వాత నెత్తి నోరు బాదుకున్నా కానీ మీకు తిరిగి ఇవ్వరు. దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అందుకే డబ్బులను పట్టుకొని తిరగవద్దని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. ఇంతకీ ఎందుకిలా అంటే అంతా ఎన్నికలు తెచ్చిన తంట అని చెప్పక తప్పదు. ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్న సొత్తును జిల్లాస్థాయిలో ఉండే కమిటీకి అప్పగిస్తారు. జిల్లా పరిషత్ సీఈఓ నేతృత్వంలో ఉన్నతాధికారులు ఈ కమిటీలో ఉంటారు.  నగదు, నగల తరలింపునకు సంబంధించి పూర్తిస్థాయి అనుమతులు చూపించగలిగితే వాటిని వెనక్కు తెచ్చుకోవచ్చని అధికారులు వివరించారు.

అధికారుల సూచనల ప్రకారం, అత్యవసరంగా ఎవరైనా నగదు తరలిస్తుంటే దానికి సంబంధించి  పక్కాగా ఆధారాలను వెంటబెట్టుకొని తిరగాలి. బ్యాంకు రసీదులు..  దుకాణంలో సరుకులకు చెల్లించే మొత్తానికి సంబంధించి కొటేషన్ తప్పనిసరిగా ఉండాలి.  ఆసుపత్రుల్లో డబ్బు చెల్లింపులకు సంబంధించిన రసీదులు ఉండాలి. నగల విషయంలో ఆర్డర్ కాపీ, తరలింపు పత్రం కూడా కంపల్సరీ.  బ్యాంకులకు నగదు రవాణా చేసే సంస్థలు సాయంత్రం వరకూ మాత్రమే నగదు తరలింపునకు అనుమతి ఉంటుంది.