పెన్షన్ డబ్బుల్లో కోత..జీపీ ఎదుట బాధితుల ఆందోళన

కౌడిపల్లి, వెలుగు : ప్రతి నెలా ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ డబ్బుల్లో రూ.16 కోత విధిస్తున్నారని ఆరోపిస్తూ మండలంలోని మహమ్మద్ నగర్ గ్రామ పంచాయతీ వద్ద మంగళవారం వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఆందోళనకు దిగారు.  మండలంలోని మహమ్మద్ నగర్, కన్నారం, కొత్తచెరువు తండా, శేరి తండాల్లో 650 మంది పెన్షన్ దారులు ఉండగా మూడు నెలలుగా ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ డబ్బులలో రూ.16 కోత విధిస్తున్నారని ఆరోపించారు.  ఇలా ప్రతినెలా పెన్షన్ లో కోత విధించి బీపీఎం రూ.10 వేలు  మిగిల్చుకుంటున్నాడని ఆరోపించారు. 

ఇదేంటని అడిగితే తనకు  రావడానికి పోవడానికి చార్జీలు అవుతాయని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ మూడు నెలలుగా పెన్షన్​లో కోత విధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందజేస్తున్న పెన్షన్ డబ్బులు పూర్తిగా ఇవ్వాలని బీపీఓంతో గొడవకు దిగారు. మొత్తం డబ్బులు ఎవరికి ఇచ్చేది లేదని మీ ఇష్టం ఉన్న వాళ్లకు చెప్పుకోమని అతను చెప్పడంతో చేసేది లేక పెన్షన్ దారులు వెనుదిరిగిపోయారు. 

ఈ విషయమై సంగారెడ్డి  పోస్టల్​ సబ్ డివిజన్ అధికారిని వివరణ కోరగా పెన్షన్ డబ్బులలో కోత విధిస్తున్న బీపీఎం పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం అందజేస్తున్న పెన్షన్ డబ్బులు పూర్తిగా అందించాలన్నారు.