శివసేన రెబల్ ఎమ్మెల్యేలతో ఏక్ నాథ్ షిండే గౌహతి నుంచి శుక్రవారం రాత్రి లేదా శనివారం ఉదయం ముంబైకి బయలుదేరుతారంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వారంతా ముంబైలో దిగగానే డిప్యూటీ స్పీకర్ నరహరి సీతారాం జిర్వాల్ ను కలుస్తారని అంచనా వేస్తున్నారు. ఇక ఏక్ నాథ్ షిండేనే శాసన సభా పక్ష నేతగా భావిస్తామని రెబల్ ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రకటించారు. ఈమేరకు డిప్యూటీ స్పీకర్ కు ఏక్ నాథ్ లేఖ కూడా రాశారు. తమ పార్టీ చీఫ్ విప్ గా భరత్ సేత్ గోగావాలే ఉంటారని అందులో ప్రస్తావించారు. ఆ లేఖపై 37 మంది రెబల్ ఎమ్మెల్యేలు సంతకాలు కూడా చేశారు. ఈనేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ ఎదుట ఆ 37 మంది ఎమ్మెల్యేలను ఏక్ నాథ్ షిండే హాజరుపరిచే అవకాశం ఉందని భావిస్తున్నారు.
పది నోటీసులిచ్చినా భయపడను : ఏక్ నాథ్ షిండే
మరో పది నోటీసులిచ్చినా భయపడేది లేదని శివసేన రెబల్స్ గ్రూపునకు నాయకత్వం వహిస్తున్న ఏక్ నాథ్ షిండే చెబుతున్నారు. శివసేన దగ్గర ఇప్పుడు 13 మంది ఎమ్మెల్యేలే ఉన్నారని ఆయన అంటున్నారు. శాసన సభలో బల నిరూపణకు రెడీ అని ప్రకటించారు. బలం లేకున్నా నోటీసులు ఎలా ఇస్తారని సీఎం ఉద్దవ్ థాక్రేను ఏక్ నాథ్ ప్రశ్నించారు.
శివ సైనికులు మీ సంగతి చూసుకుంటారు: ఉద్ధవ్
ఏక్ నాథ్ షిండే మాటలపై ఉద్ధవ్ ఘాటుగా స్పందించారు. ‘‘శివ సైనికులు మీ సంగతి చూసుకుంటారు. లెక్కలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. 16 మంది రెబల్స్ కు నోటీసులు ఇచ్చాం. బలనిరూపణలో మేమే గెలుస్తం. శివాజీ మహారాజ్ ఓడిపోయినప్పటికీ ప్రజలు ఎప్పుడూ ఆయనతోనే ఉన్నారు. నేను కలలో కూడా సీఎం కావాలని కోరుకోలేదు. అధికారం కోసం తాపత్రయ పడలేదు. ఏక్ నాథ్ కోసం ఎంతో చేశాను. నా వద్ద ఉన్న ఒక శాఖను కూడా ఆయనకు ఇచ్చేశాను. ఏక్ నాథ్ కొడుకు స్వయానా ఒక ఎంపీ. అయినా నా కొడుకును లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలు చేస్తుండటం దారుణం’’ అని ఉద్ధవ్ థాక్రే పేర్కొన్నారు.
