డ్రైవర్ ఉండడు.. బ్యాటరీతో నడుస్తది..త్వరలో సరికొత్త ట్రాన్స్పోర్ట్ సిస్టమ్

డ్రైవర్ ఉండడు.. బ్యాటరీతో నడుస్తది..త్వరలో సరికొత్త ట్రాన్స్పోర్ట్ సిస్టమ్
  • నలుగురు లేదా ఆరుగురు జర్నీ చేయొచ్చు 
  • సిటీలో రోడ్ల పక్కన ఐదడుగుల మేర ట్రాక్​ 
  • మెట్రో స్టేషన్లకు అనుసంధానం 
  • ఇప్పటికే విదేశాల్లో నడుస్తున్న ట్రాన్స్​పాడ్స్​
  • అధ్యయనం చేస్తున్న ఉమ్టా

హైదరాబాద్​ సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు హెచ్ఎండీఏలోని యూనిఫైడ్​ మెట్రోపాలిటన్​ ట్రాన్స్​పోర్ట్​అథారిటీ(ఉమ్టా)అధికారులు సరికొత్త ట్రాన్స్​పోర్ట్ ​సిస్టమ్​ తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తిగా విదేశీ పరిజ్ఞానంతో నడిచే పర్సనల్ ర్యాపిడ్​ట్రాన్స్ పోర్ట్ (పీఆర్టీ)ను అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అధ్యయనం పూర్తయిన వెంటనే సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. 

ఈ పీఆర్టీ ట్రాన్స్​పోర్ట్​ పాడ్​లో నలుగురు లేదా ఆరుగురు ప్రయాణం చేయవచ్చు. ఇవి పూర్తిగా బ్యాటరీతో, ఆటోమెటిక్​గా డ్రైవర్ లేకుండా నడుస్తాయి. వీటిని ఎక్కువ ట్రాఫిక్ ​సమస్య ఉన్న ఐటీ కారిడార్ తో పాటు నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నారు. 

ఎంతకూ తీరని ట్రాఫిక్​ సమస్య

హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీగా ప్రపంచంలో 41వ స్థానంలో ఉంది. రోజూ ట్రాఫిక్, వాహనాల రద్దీ కారణంగా నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడిన రోజుల్లో ఇది ఇంకా తీవ్రమవుతోంది. ఇప్పటికే గ్రేటర్ లో జనాభా కోటి 30 లక్షలకు చేరువైంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రభుత్వం ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు నిర్మిస్తోంది. నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు మెట్రో రైల్​సౌకర్యం ఏర్పాటు చేసింది. అయినా, ట్రాఫిక్​సమస్య తగ్గడం లేదు. దీనికి చెక్ పెట్టేందుకే సర్కారు పర్సనల్ ర్యాపిడ్​ ట్రాన్సిట్ విధానాన్ని తీసుకువచ్చేందుకు అధ్యయనం చేయిస్తోంది.  

ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారంటే..

నగరంలో ట్రాఫిక్ అధికంగా ఉండే ఐటీ కారిడార్లలో వీటిని ఏర్పాటు చేసే అంశంపై ఉమ్టా అధికారులు అధ్యయనం చేస్తున్నారు. రద్దీ అధికంగా ఉండే రాయదుర్గ్‌‌‌‌‌‌‌‌- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్​, ఐటీ కారిడార్స్, ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టు మార్గాల్లో ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నారు. ఈ ట్రాన్స్​పో ర్ట్​సిస్టమ్​ ఆఫీసులు, స్కూల్స్, కాలేజీలు, ఇతర పనులకు వెళ్లే వారు గంటలకొద్దీ ట్రాఫిక్ లోనే గడపాల్సిన పరిస్థితిని దూరం చేస్తుందంటున్నారు.

పీఆర్టీ పాడ్స్​ ఎలా పని చేస్తాయి? 

పర్సనల్ ర్యాపిడ్​ ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థలో తీసుకువచ్చే వాహనాలు చిన్న పాడ్​ల (బాక్సులు) మాదిరిగా ఉంటాయి. ఒక్కో పాడ్​లో ఆరు నుంచి పది మంది వరకూ ప్రయాణించొచ్చు. మెట్రోరైల్​మాదిరిగా ఎలివేటెడ్ పాడ్స్​గానే కాకుండా నేలపై నడిచేలా వీటిని నిర్మిస్తారు. తక్కువ స్థలంలోనే అంటే ఐదారు అడుగుల్లోనే రైల్వే లైన్ల మాదిరి పట్టాలు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఉన్న రోడ్ల పక్కనే ఏర్పాటు చేసే అవకాశం ఉండడం వల్ల ప్రత్యేకంగా భూసేకరణ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. వీటిని మెట్రో స్టేషన్లకు అనుసంధానం చేస్తారు. దీనివల్ల మెట్రో దిగిన వారు వెంటనే ఈ ట్రాన్స్ పాడ్ లోకి ఎక్కి గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. 

ఒక్క ట్రిప్​లో ఆరుగురి వరకు లగేజీతో జర్నీ చేయొచ్చు. డ్రైవర్ లేకుండా, పూర్తిగా ఆటోమేటిక్‌‌‌‌‌‌‌‌ విధానంలో పనిచేస్తాయి. ప్రత్యేకంగా నిర్మించిన కమాండ్​ కంట్రోల్​సెంటర్​నుంచి వీటిని ఆపరేట్​చేయొచ్చు. ఇప్పటికే విదేశాల్లో ఈ టెక్నాలజీతో ట్రాన్స్​పాడ్స్​నడిపిస్తున్నారు. మన దేశంలోని ముంబైలో ఉన్న బీకేసీ ఏరియాలో ఈ ట్రాన్స్​పాడ్స్​నడిపేందుకు నెట్​వర్క్​జరుగుతోంది. ఈ సిస్టమ్​మన నగరంలో అందుబాటులోకి వస్తే రోజుకు 2 లక్షల మందికి ఉపయోగపడతుంది. ఈ సరికొత్త ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్​అమలు చేయడం వల్ల వ్యక్తిగత వాహనాల వినియోగం కూడా తగ్గుతుందంటున్నారు.