ఏడుపాయల వనదుర్గా భవానీ క్షేత్రంలో భక్తుల కిటకిట

పాపన్నపేట, వెలుగు: మెదక్​జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా భవానీ క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సెలవు దినం కావడంతో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో  ఆలయ పరిసరాలు దుర్గమ్మ నామస్మరణతో మార్మోగాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఉదయమే మంజీర నదిలో పుణ్య స్నానాల ఆచరించి అమ్మవారి దర్శనం కోసం మండపంలో  క్యూ కట్టారు. అనంతరం దుర్గమ్మకు ఒడిబియ్యం పోసి, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఏడుపాయలకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు