జలదిగ్భంధంలో ఏడుపాయల

  • మంజీరా నదికి వరద ప్రవాహం
  • పొంగిపొర్లుతున్న ఘనపూర్ ​ఆనకట్ట 

పాపన్నపేట, వెలుగు: ఏడుపాయల వన దుర్గ భవానీ ఆలయం జలదిగ్భంధంలో చిక్కుకుంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మంజీరా నదికి భారీ వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో వనదుర్గా ప్రాజెక్టు పూర్తిగా నిండి పొంగిపొర్లుతోంది. ఆనకట్ట మీద నుంచి 13 వేల క్యూసెక్కుల నీరు కిందకు ప్రవహిస్తోంది. దీంతో ఆదివారం మధ్యాహ్నం నుంచి అధికారులు ఆలయాన్ని మూసివేశారు.

పూజారులు అమ్మవారి ఉత్సహ విగ్రహాన్ని రాజగోపురంలో ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురవడంతో భక్తుల రాక తగ్గింది. కాగా వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ఎస్పీ ఉదయ్​కుమార్​ఆలయాన్ని సందర్శించి భక్తులు ప్రాజెక్ట్​ వైపు వెళ్లకుండా చూడాలన్నారు. ఎప్పటికపుడు పరిస్థితిని పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.