నిర్లక్ష్యమైన ప్రభుత్వ విద్యను గాడిన పెట్టాలి

తెలంగాణ రాష్ట్రం సాధించుకుని దశాబ్ద కాలం పూర్తి అయింది.  ప్రత్యేక తెలంగాణ  ఆవిర్భావంలో  విద్యార్థుల పాత్ర  అమోఘం.  తెలంగాణ  ప్రాంతానికి  జరుగుతున్న అన్యాయాన్ని గ్రామాలకి తీసుకెళ్లి,  ప్రజలను చైతన్యపరిచి ఉద్యమంలో భాగస్వామ్యం చేసిన ఘనత  విద్యార్థులకు దక్కుతుంది. 

వాస్తవానికి మలిదశ పోరాటం తద్వారా ఏర్పడ్డ  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఘనత విద్యార్థులదే అని చెప్పవచ్చు.  కులాలకు, మతాలకు, భావజాలాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా  విద్యార్థులు ఉద్యమాన్ని నడిపారు.  ఎంతోమంది  త్యాగాల మీద  ఏర్పడిందే  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయమే  కేంద్ర బిందువుగా ఉద్యమం కొనసాగింది. 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర  ఆవిర్భావ  అనంతరం  ఏర్పడ్డ  ప్రభుత్వ పాలనలో  నియామకాలుదానితో ముడిపడి వున్న విద్యాభివృద్ధి  కుంటుపడిందిగడిచిన దశాబ్ద కాలంలో  కొన్ని ప్రాథమిక పాఠశాలలు,  ఉన్నత  పాఠశాలల్లో అరకొర టీచర్స్ ఉద్యోగ నియామకాలు తప్ప పెద్దగా హయ్యర్​  ఎడ్యుకేషన్ పట్టించుకోకపోవడంతో  బాగా నష్టం కూడా జరిగింది.  పదేండ్లలో  గత  ప్రభుత్వం కొత్త సాంఘిక సంక్షేమ పాఠశాలలు,  ఇంటర్  కళాశాలలు, డిగ్రీ కళాశాలలు స్థాపించినది వాస్తవమే.  

కానీ,  దానికి సరిపడా బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బంది,  మౌలిక సదుపాయాలు ఏర్పరచడంలో  బీఆర్ఎస్​ ప్రభుత్వం విఫలం అయింది.  కొత్తగా ప్రారంభించిన విద్యాసంస్థలు  అద్దె భవనాల్లో నడుస్తున్నాయి.  మొన్నటికి మొన్న సరియైన సమయానికి అద్దె చెల్లించడం లేదు అని గురుకులాలకి తాళాలు వేసిన పరిస్థితిని మనం చూశాం. ఉద్యోగ భర్తీల కోసం నోటిఫికేషన్ ఇచ్చి సరైన పద్ధతిలో పరీక్షలు పెట్టడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. తద్వారా  ప్రభుత్వ నిర్లక్షాన్ని సహించని విద్యార్థులు మార్పుకోసం  ప్రతి గ్రామానికి కదలి ప్రభుత్వ మార్పుకోసం వాలంటీర్ గా పనిచేశారు. 

బీఆర్ఎస్​ పాలనలో  విద్యావ్యవస్థ నిర్వీర్యం

నిజానికి యూనివర్సిటీ విద్యావ్యవస్థ గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్వీర్యమైన పరిస్థితి. తెలంగాణలో 15 విశ్వవిద్యాలయాలు ఉంటే గత పదేండ్లలో ఎలాంటి సదుపాయాలు కానీ, రిక్రూట్​మెంట్​కానీ ఇవ్వకపోవడం గత ప్రభుత్వం చేసిన కుట్ర.  నామమాత్రంగా వైస్ చాన్సలర్లను నియమించి కాలయాపన చేశారు.  విశ్వవిద్యాలయాలకు తగిననిధుల కేటాయింపు జరగలేదు.  తెలంగాణలో  ఇప్పటికే బోధన, బోధనేతర  సిబ్బంది చాలామంది పదవీ విరమణ పొందారు.  తెలంగాణలో  విశ్వవిద్యాలయాల  పరిస్థితి  ఇంకా దయనీయంగానే ఉంది.  తెలంగాణ,  పాలమూరు, శాతవాహన, మహాత్మాగాంధీ  మొదలగు విశ్వవిద్యాలయాలకు కేవలం ఒకే ఒక ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది. కాంట్రాక్ట్, పార్ట్ టైం, అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోర్సింగ్ ఉద్యోగస్తులతో అన్ని విశ్వవిద్యాలయాలు నడుస్తున్నాయి. 

యూనివర్సిటీల్లో అరకొర వసతులు

అన్ని యూనివర్సిటీలు  అరకొర వసతులతో  కేవలం నామమాత్రంగా మాత్రమే నడుస్తున్న పరిస్థితి.  ప్రభుత్వం కూడా కేవలం ఉద్యోగుల జీతభత్యాలు మినహా ఎలాంటి అభివృద్ధికి పూనుకోలేదు.  యూనివర్సిటీలు విద్యార్థులు చెల్లిస్తున్న ఫీజులతో నడిపించిన పరిస్థితి. అన్ని ఫీజులు కడుతున్న విద్యార్థులు అరకొర వసతులతో గడిపారు. 11 యూనివర్సిటీలలో  సుమారుగా 1600 అధ్యాపకుల పోస్టులు (అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్) ఖాళీగా ఉన్నాయి. 2012లో చివరి ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది.  మూడు సంవత్సరాల తరువాత రిక్రూట్​మెంట్ జరిగింది.  

గత ప్రభుత్వ నిర్వాకాన్ని కాలరాయాలి

2012 తరువాత ఇప్పటివరకు బోధన,  బోధనేతర సిబ్బంది  ఉద్యోగ నోటిఫికేషన్లు  ఇవ్వకపోవడం.. విద్యార్థులను చదువుకు దూరం చేయడమే అవుతుంది. ఇది పూర్తిగా గత ప్రభుత్వ వైఫల్యమే. నిజానికి యూనివర్సిటీలో  చదువు కోసం వచ్చే  మెజారిటీ  విద్యార్థుల్లో గ్రామీణ ప్రాంతాలు,  బడుగు, బలహీన వర్గాలకు చెందినవారే ఎక్కువగా ఉంటారు. యూనివర్సిటీలను ఉన్నత విద్య అందించే  సంస్థలుగా కాకుండా బువ్వకోసం,  వసతి గృహాలుగా మార్చింది గత ప్రభుత్వం.  యూనివర్సిటీ హాస్టల్​లో ఉండి  ఏదో  చిన్న ఉద్యోగాలకు ప్రిపేర్ అయి  వెళ్లిపోయేవారికి ఇక అభివృద్ధి ఎందుకు అనే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది. 

విద్యావ్యవస్థ పునరుద్ధరణకు కాంగ్రెస్ సర్కార్​ కృషిప్రజాతీర్పుతో  అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ సారథ్యంలోని  ప్రజాప్రభుత్వం  విద్యావ్యవస్థని  పునరుద్ధరణకు కృషి చేస్తోంది. ఇటీవల సుమారు 11000 ఉపాధ్యాయుల నియామకం జరపడం ఆహ్వానించదగ్గ పరిణామం. ప్రభుత్వ పాఠశాలల్లో  ఉపాధ్యాయుల కొరత చాలామేరకు తీర్చగలిగారనే చెప్పాలి.  కొత్తగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, శంకుస్థాపన దానికి సంబంధించిన విషయాలను వేగవంతం చేసింది. కాలానుగుణంగా సాంకేతిక విద్య, స్కిల్ నైపుణ్యం పెంపొందించడం మంచి ఆలోచన.  ప్రభుత్వ యూని వర్సిటీలను అభివృద్ధి చేయడం సర్కారు బాధ్యత. 

ప్రక్షాళన అలంకార ప్రాయం కావద్దు

కాంగ్రెస్​ సర్కారు ఇటీవల  ప్రకటించిన విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ నియామకాలు అందరూ స్వాగతించదగ్గ విషయం. గత ప్రభుత్వ హయాంలో ఐఏఎస్ అధికారులను ఇంచార్జ్ వీసీలుగా నియమించడం ద్వారా అకడమిక్ వాతావరణం అస్తవ్యస్తంగా మారిన విషయం తెలిసిందే.  దీనివల్ల విశ్వవిద్యాలయాలు ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండానే  సిబ్బంది కొరత, నిధుల లోపం, నియామకాలు లేకుండా కొనసాగాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం చెబుతున్న విద్యా వ్యవస్థ ప్రక్షాళన కేవలం అలంకార ప్రాయం కాకూడదు.  అవసరమైన నిధులు, నియామకాలు చేపట్టి భవిష్యత్ తరాలకు ఉన్నత విద్య అందించేందుకు విశ్వవిద్యాలయాల అభివృద్ధికి కృషి చేయాలి.

- డా. సుమన్ దామెర,అసిస్టెంట్ ప్రొఫెసర్, మిజోరం  యూనివర్సిటీ