విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెస్తాం : ఆకునూరి మురళి

కల్వకుర్తి/అమ్రాబాద్‌‌, వెలుగు : తెలంగాణ ప్రభుత్వ విద్యా వ్యవస్థలో, సంక్షేమ హాస్టల్లో ప్రస్తుతం ఉన్న పాలసీలను సమూలంగా మార్చాల్సి ఉందని విద్యా కమిషన్‌‌ చైర్మన్‌‌ ఆకునూరి మురళి చెప్పారు. నాగర్‌‌ కర్నూల్‌‌ జిల్లా వెల్దండ, అమ్రాబాద్‌‌ మండలాల్లోని పలు స్కూళ్లు, హాస్టల్స్‌‌ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఒక్కో సంక్షేమ హాస్టల్‌‌లో ఒక్కో పాలసీ అమలవుతోందన్నారు. తనతో పాటు విద్యా కమిషన్‌‌లో ఉన్న ముగ్గురు సభ్యులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని స్కూళ్లు, హాస్టళ్లలో వసతుల గురించి స్టడీ చేస్తున్నామన్నారు. 

తాము గుర్తించిన అంశాలతో ప్రభుత్వానికి రిపోర్ట్‌‌ అందజేస్తామని చెప్పారు. హాస్టల్‌‌ బిల్స్‌‌ సకాలంలో అందేలా కృషి చేస్తామన్నారు. విద్యావ్యవస్థను చక్కదిద్దేందుకు, చదువుతో పాటు మెరుగైన భోజన వసతి కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అనంతరం అమ్రాబాద్‌‌ మండలంలోని ప్రభుత్వ స్కూల్‌‌లో స్టూడెంట్లతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఐటీడీఏ ఇన్‌‌చార్జి పీవో రోహిత్‌‌ గోపిడి, కమిషన్‌‌ సభ్యులు, డీఈవో రాజశేఖర్‌‌రావు, ఎంఈవో బాలకిషన్‌‌ ఉన్నారు.