కోల్‌కతా: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి, అతడి భార్య రుజిరా బెనర్జీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు ఇచ్చింది. కోల్ స్మగ్లింగ్ కేసులో మనీలాండరింగ్ వ్యవహారంపై విచారించేందుకు సమన్లు పంపింది. ఈ ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు రుజిరా బెనర్జీని సెప్టెంబర్ 1న, అభిషేక్ బెనర్జీని సెప్టెంబర్ 6న న్యూఢిల్లీ వచ్చి విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ నోటీసుల్లో పేర్కొంది.
ఇద్దరు ఐపీఎస్‌లకు కూడా నోటీసులు
అభిషేక్, రుజిరాల లాయర్ సంజయ్ బసుకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. సెప్టెంబర్ 3న విచారణకు రావాలని సూచించింది. అలాగే వెస్ట్ బెంగాల్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్న ఇద్దరు ఐపీఎస్ అధికారులు శ్యామ్ సింగ్, జ్ఞాన్‌వంత్ సింగ్‌లకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. వారిద్దరినీ సెప్టెంబర్ 8, 9 తేదీల్లో విచారణకు రావాలని సమన్లతో పేర్కొంది.
కేసు ఏంటి?
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీబీఐ ఆ రాష్ట్రంలో జరిగిన ప్రభుత్వ బొగ్గు గనుల స్కామ్‌పై అభిషేక్ బెనర్జీతో పాటు పలువురు ప్రభుత్వాధికారులపై రైడ్స్ చేసింది. బోగస్ అగ్రిమెంట్లతో అక్రమ మైనింగ్ చేసి బొగ్గు స్మగ్లింగ్ చేసినట్లు సీబీఐ ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేసింది. అయితే ఆ అగ్రిమెంట్లు చేసుకున్న రెండు కంపెనీల్లో అభిషేక్ బెనర్జీ కుటుంబానికి వాటాలు ఉన్నాయని, ఆయన తండ్రి అమిత్ బెనర్జీ ఒక కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నాడని, ఈ కంపెనీల్లో కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగాయని అలిగేషన్స్‌పై ఈడీ విచారణ ప్రారంభించింది.
