సాహితీ గ్రూప్ లింకులపై ఈడీ గురి .. రెండు రియల్టర్ కంపెనీల్లో సోదాలు

  • రూ.5 కోట్ల విలువ చేసే నగలు, రూ.72లక్షల క్యాష్ స్వాధీనం
  • ఇప్పటికే రూ.161 కోట్ల సాహితీ ప్రాపర్టీస్ అటాచ్

హైదరాబాద్‌‌, వెలుగు: సాహితీ ఇన్‌‌ఫ్రా మనీలాండరింగ్‌‌ కేసులో ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సాహితీ గ్రూప్‌‌ ఆఫ్ కంపెనీస్‌‌లో పెట్టుబడులు పెట్టిన రియల్టర్స్‌‌ కంపెనీలు, సంస్థల చైర్మన్లు, ఎండీల ఇండ్లల్లో గురువారం సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌‌లోని సీఎస్‌‌కే రియల్టర్స్‌‌, సింగ్‌‌ మాన్షన్స్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెట్ కంపెనీల ఎండీలు సురేశ్, కేఆర్ అగర్వాల్, రిక్షిత్ అగర్వాల్ కు చెందిన 11 ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. రూ.5.42 కోట్ల విలువైన నగలు, రూ.72.75 లక్షల నగదు సీజ్ చేశారు. మొత్తం రూ.6.15 కోట్లుగా నిర్ధారించారు. 

డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో హైదరాబాద్ జోన్ ఈడీ అధికారులు వెల్లడించారు. కాగా, సాహితీ ఇన్‌‌ఫ్రాపై సిటీ సీసీఎస్‌‌లో నమోదైన ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌ ఆధారంగా ఈడీ కేసు పెట్టింది. సాహితీ లక్ష్మినారాయణ సహా గ్రూప్ ఆఫ్‌‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారి వివరాలు సేకరించారు. దర్యాప్తులో భాగంగా డిపాజిటర్ల నుంచి రూ.842.15 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించారు. ఇందులో రూ.216.91 కోట్ల నగదును డిపాజిటర్ల నుంచి సేకరించారు. ఈ డబ్బును రియల్ ఎస్టేట్‌‌ సహా ఇతర వ్యాపారాల్లోకి మళ్లించినట్లు గుర్తించారు.

ఈ క్రమంలోనే సీఎస్‌‌కే రియల్టర్స్‌‌, సింగ్‌‌ మాన్షన్స్ ప్రైవేట్‌‌ లిమిటెడ్​కు చెందిన సురేశ్, కేఆర్‌‌‌‌ అగర్వాల్‌‌, రక్షిత్‌‌కు సంబంధించి రూ.20 కోట్లు సాహితీ ఇన్​ఫ్రాతో కలిసి పెట్టుబడులు పెట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే రూ.161.5 కోట్ల ఆస్తులను అటాచ్‌‌ చేసినట్టు ఈడీ వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్ట్‌‌ 29న ప్రాసిక్యూషన్ కంప్లైంట్ (పీసీ) దాఖలు చేసినట్లు తెలిపింది. సాహితీ ఎండీ లక్ష్మినారాయణ జ్యుడీషియల్ రిమాండ్‌‌లో ఉన్నట్లు వెల్లడించింది.