కేటీఆర్ కు ఈడీ నోటీసులు... జనవరి 7న విచారణకు రండి..

బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. కేటీఆర్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ   చేశారు.  ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు లో KTR ను జనవరి 7న విచారణకు రావాలని ఈడీ అధికారులు తెలిపారు.  అలాగే సీనియర్ IAS అధికారి అరవింద్ కుమార్, HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిలను జనవరి 2,3 తేదీల్లో విచారణకు రావాలని  వారికి కూడా నోటీసులు ఇచ్చారు. 

 ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు ను ACB నమోదు చేసిన  FIR ఆధారంగా PMLA చట్టం కింద ఈడీ విచారణ చేపట్టింది. బీఆర్ఎస్ హయాంలో ఫెమా నిబంధనలు ఉల్లంఘించి .. FEO కు 55 కోట్లు నగదు బదిలీ అయిందని ఈడీ గుర్తించింది.  ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో ఆర్థికపరమైన అవకతవలు జరిగాయని ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ కార్ రేస్ కేసు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఈ కేసులో ఎట్టకేలకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఏ-1గా చేర్చారు. గత ప్రభుత్వంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేసిన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ఏ-2గా చేర్చారు. బీఎల్ఎన్ రెడ్డిని ఏ-3గా చేర్చారు.