రంగారెడ్డి జిల్లా భూ కేటాయింపుల వెనుక మనీలాండరింగ్!

  • ఐఏఎస్‌‌ అమోయ్‌‌కుమార్‌‌ నుంచి కీలక వివరాలు రాబట్టిన ఈడీ
  • భారీ రియల్‌‌ ఎస్టేట్‌‌ ప్రాజెక్టుల్లో వందల కోట్ల పెట్టుబడులు 
  • తాజాగా బీఆర్‌‌‌‌ఎస్‌‌ మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌‌రెడ్డి సహా పలువురికి సమన్లు
  • నేడు విచారణకు హాజరయ్యే చాన్స్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రంగారెడ్డి జిల్లా భూ కుంభకోణంలో ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. మొదట మహేశ్వరం మండలం నాగారం భూదాన్‌‌‌‌ భూములకే పరిమితమైన ఈ కేసు ప్రస్తుతం అనేక మలుపులు తిరుగుతున్నది. ప్రధానంగా గత బీఆర్ఎస్ సర్కారు​ హయాంలో అమోయ్​కుమార్​ కలెక్టర్​గా పనిచేసిన రంగారెడ్డి, మేడ్చల్​ జిల్లాల పరిధిలోని శంకరహిల్స్ సొసైటీ, బాల సాయిబాబా ట్రస్ట్‌‌‌‌, రాయదుర్గం, శేరిలింగంపల్లి, ఖాజాగూడ ప్రాంతాల్లో  భారీగా భూ అక్రమాలు జరిగినట్టు ఈడీ గుర్తించింది. నిషేధిత జాబితాలో ఉన్న భూములకు క్లియరెన్స్​ ఇవ్వడం ద్వారా అన్యాక్రాంతం చేసినట్టు ప్రాథమిక ఆధారాలు సేకరించింది.  ప్రముఖ కన్‌‌‌‌స్ట్రక్షన్స్‌‌‌‌  కంపెనీలకు భూములు దక్కడం వెనుక వందల కోట్ల మనీలాండరింగ్ జరిగినట్టు దర్యాప్తులో బయటపడింది.  నాటి ప్రభుత్వంలోని కీలక నేతలు ఈ ప్రాజెక్టుల్లో  భారీ పెట్టుబడులు పెట్టి, వాటాలు దక్కించుకున్నట్టు తెలుస్తున్నది. ఇందుకు సంబంధించి నాటి కలెక్టర్‌‌‌‌‌‌‌‌ అమోయ్‌‌‌‌కుమార్‌‌‌‌ ఇచ్చిన  స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆధారంగానే గురువారం బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ మాజీ ఎమ్మెల్యే  జనార్దన్‌‌‌‌ రెడ్డి, ఆమోద డెవలపర్స్‌‌‌‌– తలసు సూర్య తేజ, కేఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ మైన్స్‌‌‌‌– కె. సిద్ధారెడ్డితోపాటు మరో బిల్డర్​కు  సమన్లు జారీ అయ్యాయి. ఈడీ ఆదేశాల మేరకు వీరంతా మంగళవారం విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.
 
కీలకంగా మారిన అమోయ్​కుమార్​ స్టేట్​మెంట్ 

ఈడీ దర్యాప్తులో అమోయ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ కీలకంగా మారింది. మహేశ్వరం మండలం నాగారం భూదాన్‌‌‌‌ భూ కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా విచారణ ప్రారంభించిన ఈడీ అధికారులకు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు చెందిన బాధితుల నుంచి 12 ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలోనే అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో 23,24,25వ తేదీల్లో అమోయ్​కుమార్​ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ‌‌‌‌సీసీఎల్‌‌‌‌ఏ డాక్యుమెంట్స్‌‌‌‌, ధరణి పోర్టల్‌‌‌‌లో మార్పుల ఆధారంగా అమోయ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ నుంచి వివరాలు సేకరించారు. ఆయనతోపాటు అప్పటి తహసీల్దార్, ఆర్డీవో, పలువురు రియల్టర్లు సహా 15 మందిని  విచారించారు.  ప్రధానంగా ఐఏఎస్‌‌‌‌ అమోయ్‌‌‌‌కుమార్‌‌‌‌ ఇచ్చిన స్టేట్‌‌‌‌మెంట్స్‌‌‌‌ ఆధారంగానే  సంబంధిత వ్యక్తులకు ఈడీ సమన్లు జారీ చేస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. ఈ లిస్ట్​లో మరికొంత మంది బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ నేతలు ఉన్నారనే వార్తలు ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి.