ఈడీ కబడ్డీ! కేసీఆర్ ఫ్యామిలీ అక్రమాలపై ఉక్కుపాదం

  • ఫార్ములా–ఈ లో కేటీఆర్ కు నోటీసులు
  •  మొన్నలిక్కర్ కేసులో కవిత అరెస్ట్
  •  జీఎస్టీ స్కాంలో మాజీ కేసీఆర్ పై కేసు?

 గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వ విచారణలు ఓ వైపు సాగుతుండగా కేంద్రం ప్రభుత్వం ఆధీనంలోని విచారణ సంస్థలు ఎంట్రీ ఇస్తుండటం విశేషం. మాజీ సీఎం కేసీఆర్ ఫ్యామిలీలో ముగ్గురిపై ఇప్పటి వరకు కేసులు నమోదయ్యాయి. ఫార్ములా–ఈ కేసులోకి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ ఇచ్చింది. 

గత ప్రభుత్వ హయాంలో 55 కోట్ల నిధుల అక్రమ మళ్లింపు కేసులో కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది.  జనవరి 7న విచారణకు రావాల్సిందిగా పేర్కొంది. కేటీఆర్ తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డికి సైతం ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 2, 3 తేదీల్లో విచారణ కు రావాలని వీరికి ఇచ్చిన నోటీసుల్లో ఈడీ పేర్కొంది. 

ఇదే కేసుకు సంబంధించి ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది. దీంతో కేటీఆర్ విచారణ కోసం ఈడీ ఆఫీసు మెట్లెక్కాల్సిందే. ఇదే ఏడాది లిక్కర్ స్కాం కేసులో కేటీఆర్ చెల్లెలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. ఏకంగా ఈడీ అధికారులు అరెస్టు చేసిన ఆమెను తీహార్ జైలుకు పంపారు. అండర్ ట్రయల్ ఖైదీగా నాలుగు నెలల పాటు ఆమె జైలు జీవితం గడపాల్సి వచ్చింది. 

అదే సమయంలో జీఎస్టీ కుంభకోణం తెరపైకి వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో జీఎస్టీ చెల్లింపుల్లో కోట్లలో అవకతవకలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ప్రత్యేక సాఫ్ట్​వేర్ రూపొందించి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించే విధంగా వాణిజ్యపన్నుల శాఖ ఉన్నతాధికారులు ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కలసి జీఎస్టీ పన్ను ఎగవేతదారులకు సహకరించినట్టు వాణిజ్యశాఖ అధికారులు అంతర్గత ఆడిటింగ్​లో గుర్తించారు.  ఈ మేరకు ఈడీ కేసు నమోదు చేసినట్టు సమాచారం.  కేసు విచారణ కొనసాగుతోంది. దీంతో కేసీఆర్ కూడా ఈడీ విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి  ఏర్పడింది.