- నికర సంపద రూ.10 కోట్లు దాటిన వారిపై ఏడాదికి 2 శాతం పన్ను
- ఎస్టేట్‌లపై 33 శాతం వారసత్వ ట్యాక్స్ వేయాలి
- సలహా ఇచ్చిన థామస్ పికెట్టీ రీసెర్చ్ పేపర్
న్యూఢిల్లీ : దేశంలోని పేదలు, ధనికుల మధ్య అంతరాన్ని తగ్గించడానికి ధనవంతులపై ట్యాక్స్ వేయాలని ఎకనామిస్ట్ థామస్ పికెట్టీ సలహా ఇచ్చారు. రూ.10 కోట్ల కంటే ఎక్కువ సంపద ఉన్నవారిపై ఏడాదికి 2 శాతం పన్ను వేయాలని, అలానే రూ.10 కోట్ల కంటే ఎక్కువ వాల్యుయేషన్ ఉన్న ఎస్టేట్‌లపై 33 శాతం వారసత్వ పన్ను విధించాలని ఓ రీసెర్చ్ రిపోర్ట్‌లో ఆయన పేర్కొన్నారు. ‘ప్రపోజల్స్ ఫర్ ఏ వెల్త్ ట్యాక్స్ ప్యాకేజ్ టు టాకిల్ ఎక్స్‌ట్రీమ్ ఇనీక్వాలిటీస్ ఇన్ ఇండియా’ పేరుతో ఈ రీసెర్చ్ పేపర్‌ను మరికొంతమంది ఆర్థిక వేత్తలతో కలిసి రిలీజ్ చేశారు.
దేశంలోని 99.96 శాతం మంది ప్రజలపై ఎటువంటి ప్రభావం పడకుండా భారీగా ట్యాక్స్ రెవెన్యూ జనరేట్ చేయొచ్చని ఈ పేపర్ పేర్కొంది. ‘నికర సంపద రూ.10 కోట్లను దాటిన వారిపై ఏడాదికి కనీసం 2 శాతం ట్యాక్స్, రూ.10 కోట్ల వాల్యుయేషన్‌ను మించిన ఎస్టేట్‌లపై 33 శాతం వారసత్వ ట్యాక్స్ వేస్తే జీడీపీలో 2.73 శాతం అమౌంట్‌ను సేకరించొచ్చు’ అని సలహా ఇచ్చింది.
పేదలు, మిడిల్ క్లాస్‌ను సపోర్ట్ చేయడానికి రెవెన్యూను తగినవిధంగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి పాలసీలు అవసరమని పేర్కొంది. ‘ఉదాహరణకు ఎడ్యుకేషన్‌పై చేస్తున్న ఖర్చులను రెండింతలు చేయొచ్చు. గత 15 ఏళ్లుగా ఎడ్యుకేషన్‌కు చేస్తున్న ఖర్చులు జీడీపీలో 2.9 శాతం దగ్గర మిగిలిపోయాయి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 (ఎన్‌ఈపీ 2020) పెట్టుకున్న టార్గెట్ జీడీపీలో 6 శాతంలో సగానికంటే తక్కువ ఇది’ అని వివరించింది.
రికార్డ్ లెవెల్‌కు అసమానతలు
ట్యాక్స్‌లు వేయడంపై డిబేట్స్ జరగాలని, కొన్ని అంశాలపై ఏకాభిప్రాయం రావాలని ఈ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది. థామస్ పికెట్టీ (పారిస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్), లూకస్ ఛాన్సల్ (హార్వర్డ్ కెన్నెడీ స్కూల్, వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్), నితిన్ కుమార్ భారతి (న్యూ యార్క్ యూనివర్సిటీ, వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్) ఈ రీసెర్చ్ పేపర్‌ను తయారు చేశారు. దీని ప్రకారం, దేశంలో పేదలు, ధనికుల మధ్య అంతరాయం పెరుగుతుండడంపై డిబేట్స్ ఎక్కువవుతున్నాయి.
ముఖ్యంగా ‘ఇన్‌కమ్ అండ్ వెల్త్ ఇనీక్వాలిటీ ఇన్ ఇండియా 1922–2023: ది రైజ్ ఆఫ్ ది బిలియనీర్ రాజ్’ పేరుతో స్టడీ విడుదల చేసిన తర్వాత ఇటువంటి డిబేట్స్ పెరిగాయని థామస్ పికెట్టీ రీసెర్చ్ రిపోర్ట్ అభిప్రాయపడింది. ఈ స్టడీ దేశంలోని ఆర్థిక అసమానతలు రికార్డ్ లెవెల్స్‌కు చేరుకున్నాయని పేర్కొంది. తీవ్ర అసమానతలను పట్టించుకోకుండా ఉండలేమని కామెంట్ చేసింది. ఈ ఏడాది మార్చి 20 న ఈ స్టడీ విడుదల కాగా, 2000 సంవత్సరం తర్వాత దేశంలోని టాప్ 1 శాతం మంది ప్రజల సంపద భారీగా పెరిగిందని ఇది పేర్కొంది.
మొత్తం సంపదలో టాప్ 1 శాతం మంది ప్రజల వాటా గత 23 ఏళ్లలో 40.1 శాతానికి చేరుకుందని వెల్లడించింది. ముఖ్యంగా 2014–15 నుంచి 2022–23 మధ్య ధనవంతులు మరింత ధనవంతులుగా మారారని, పేదల సంపద పెద్దగా పెరగలేదని వివరించింది. 2022–23 నాటికి టాప్ 1 శాతం మంది ప్రజల ఆదాయాల వాటా వాటా జాతీయ ఆదాయాల్లో 22.6 శాతానికి, సంపద వాటా 40.1 శాతానికి చేరుకున్నాయని వివరించింది. చరిత్రలోనే ఇదే ఎక్కువని పేర్కొంది. జాతీయ ఆదాయంలో టాప్ 1 శాతం ప్రజల వాటా ప్రపంచంలోనే ఇండియాలో ఎక్కువగా ఉందని, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్, యూఎస్‌లో కంటే ఇక్కడే ఎక్కువని పేర్కొంది.
