లాజిస్టిక్స్ సర్వీసెస్ కంపెనీ ఈకామ్ ఎక్స్ ప్రెస్ వచ్చే రెండు నెలల్లో సుమారు 7,000 మందిని నియమించుకోవాలని ప్లాన్స్ వేస్తోంది. డెలివరీ, వేర్ హౌసింగ్ మేనేజ్‌మెంట్, ఆపరేషన్స్, ఐటీ, డేటా సైన్స్ విభాగాలలో ఈ హైరింగ్ ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ–కామర్స్ సైట్లకు లాజిస్టిక్ సర్వీసులను అందిస్తున్న మాకు ప్రస్తుతం ఉద్యోగుల అవసరం ఎక్కువగా ఉందని ఈకామ్ ఎక్స్ ప్రెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సౌరభ్ దీప్ సింగ్లా అన్నారు. ప్రస్తుత అసాధారణ పరిస్థితులలో ఆన్‌లైన్ షాపింగ్‌కు మంచి డిమాండ్ ఉందని, డోర్ స్టెప్ డెలివరీలు చేయడానికి ఉద్యోగులు కావాలని అన్నారు. ఈ–కామర్స్ ఇండస్ట్రీలో సప్లయ్ చెయిన్‌కు అంతరం కలగకుండా ఉండేందుకు, టైమ్‌కి డెలివరీలు జరగడానికి ఈ హైరింగ్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో ఈ హైరింగ్ సుమారు 25 శాతం వరకు ఉంటుంది. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలతో పాటు దేశంలోని ఇతర సిటీలలో కూడా ఈ హైరింగ్‌ను కంపెనీ చేపట్టనుంది.

