వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై మరోసారి చర్చకు వచ్చింది. దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని రోజుల క్రితం ప్రస్తావించారు. లేటెస్ట్ గా సెంట్రల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) సునీల్ అరోరా కూడా జమిలీ ఎన్నికలపై స్పందించడంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది. దేశ వ్యాప్తంగా జమిలీ ఎన్నికల నిర్వహించేందుకు రెడీ అన్నారు సునీల్ అరోరా . ప్రభుత్వం నిర్ణయిస్తే దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలకు తాము సిద్దంగా ఉన్నామన్నారు. జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే చట్టాల్లో మార్పులు చేయాల్సిన అవసరముందన్నారు. ఎన్నికలు నిర్వహించేందుకు నేరుగా నిర్ణయం తీసుకునే అధికారం ఈసీకి లేదన్నారు.
దేశంలో నిత్యం ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతున్నాయి. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడం,అభివృద్ధి పనులకు ఆటంకం కలగడం జరుగుతుంది. బడ్జెట్ కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే జమిలీ ఎన్నికలపై కేంద్రం ప్రస్తావించింది. అయితే ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్ కూడా జమిలీ ఎన్నికలను వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో సీఈసీ జమిలీ ఎన్నికలపై వ్యాఖ్యలు చేశారు. 2021 లో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.అప్పటి వరకు జమిలీ ఎన్నికలపై కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది తెలియాల్సి ఉంది.
