పంచాయతీరాజ్​లో ఈ–ఆఫీస్! సర్క్యులర్లు, జీవోలన్నీ ఆన్​లైన్​లోనే..

  • ఫైల్స్ జాప్యానికి చెక్​.. పెరగనున్న పారదర్శకత, జవాబుదారీతనం
  •   తొలుత పీఆర్ కమిషనరేట్​లో ప్రారంభించిన డైరెక్టర్

హైదరాబాద్, వెలుగు: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. పీఆర్ డిపార్ట్మెంట్లో ఈ–ఆఫీస్​లోనే అన్ని కార్యకలాపాలు కొనసాగించాలని డైరెక్టర్ సృజన ఆదేశాలు జారీ చేశారు. పారదర్శకత, జవాబుదారి తనంతోపాటు జాప్యానికి ఆస్కారం ఉండదని, రోజుల తరబడి ఫైల్ పెండింగ్ ఉండకుండా, ఫైల్ మాయం కాకుండా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. గతంలో మాన్యుల్ పద్ధతి అమలు కావడంతో కొంత జాప్యం జరిగేది. పనులు, సర్క్యులర్లు, జీవోలు పంపించాలంటే కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేవి. అధికారులు లీవ్ లో ఉన్నా.. వీకెండ్స్ సెలవుల్లో ఫైల్ పర్యవేక్షించాలన్నా.. వాటిని పరిశీలించి ఆమోదించాలన్నా.. తప్పని సరిగా ఆఫీస్​కు వెళ్లాల్సి వచ్చేది. ఈ క్రమంలో సెలవులో ఉన్నామనే సాకు​తో అధికారులు ఫైల్స్​ పంపడంలో కొంత ఆలసత్వం ప్రదర్శించేవారు. ఈ ఆన్ లైన్ విధానంతో ఎక్కడి నుంచైనా ఫైల్ పంపించే అవకాశం ఉంది కనుక జాప్యం చేయడానికి వీలు లేదు. అంతేకాదు, ఫైల్ లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే సంబంధిత అధికారి పంపించవచ్చు. అంతేకాకుండా, సర్క్యులర్లు, జీవోలను ఆన్ లైన్ లో పంపించడం ద్వారా అధికారులకు విషయం త్వరగా చేరుకుంటుంది. ఫైల్స్​అన్ని ఆన్ లైన్ ఉంటాయి కనుక ఎప్పుడంటే అప్పడు పరిశీలించవచ్చు.

హెచ్​ఓడీలకు ప్రత్యేక డొమైన్..

పంచాయతీరాజ్ శాఖలో అన్ని వివరాలు ఆన్ లైన్లో చూసేలా డైరెక్టర్ సృజన ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటే ఆఫీస్​ పనులు ఈజీగా అవుతాయని భావిస్తున్నారు. అయితే, ఈ నెల నుంచి అన్ని ఫైల్స్ ఆన్ లైన్ లోనే రావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఒక్క కోర్టుకు సమర్పించే అఫిడవిట్ మినహా మిగతా అన్ని ఆన్​లైన్ లో పంపిస్తున్నారు. ఇందు కోసం హెచ్ ఓడీలకు ప్రత్యేక డొమైన్ ఇచ్చారు. ఫైల్ పై సంతకం చేసేందుకు డిజిటల్ కీ ఉంటుంది. వారికి ప్రత్యేకమైన పాస్ వర్డ్ కూడా ఉంటుంది. సిస్టమ్ ఓపెన్ చేయడానికి ఒక పాస్ వర్డ్, డిజిటల్ సైన్ చేయడానికి మరో పాస్ వర్డ్​ వేర్వేరుగా ఉంటాయి. సైబర్ ఎటాక్స్ జరగకుండా పకడ్బందీ భద్రతాచర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనరేట్ లో ఈ విధానం పక్కాగా అమలు అవుతున్నది. దీని ద్వారా ఆఫీస్​లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి. పెండింగ్ లో ఉన్నాయా? సంబంధిత సెక్షన్​కు చేరాయా లేవా అనేది తెలుస్తుంది.. ఒకేవేళ పెండింగ్ ఉంటే.. ఎవరి దగ్గర ఎందుకు పెండింగ్ లో ఉందో కూడా తెలుసుకునే అవకాశం ఉంది. ఫైల్స్, సర్క్యులర్లు, జీవోల్లో చిన్నచిన్న సవరణలు, తప్పులు ఉంటే మార్చుకోవడానికి వీలు ఉంటుంది. ఇదే మాన్యువల్​పద్ధతిలో చేయడం ద్వారా కొంత జాప్యం జరిగే అవకాశం ఉం ది. త్వరలో జిల్లాలు, మండలాలు, గ్రామస్థాయిలో ఈ విధానం తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు డీఆర్డీఏలు, డీపీవోలు, మండల స్థాయి అధికారులకు అవగాహన కల్పించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు.

ఫైల్స్ మిస్ అయ్యే చాన్స్ లేదు.. 

ఈ–ఆఫీస్ ద్వారా పర్యవేక్షణ పెరగడంతోపాటు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేస్తరు. పారదర్శకత, జవాబుదారితనం పెరుగుతుంది. ముఖ్యంగా ఫైల్స్ మిస్ కావడం, చిరిగిపోవడం, దొరక్కపోవడం అనేది ఉండదు. ఏ ఫైల్ ఎవరి దగ్గర పెండింగ్ ఉందో ఈజీగా తెలిసిపోతుంది. రోజుల తరబడి పెండింగ్ లో పెట్టడానికి ఆస్కారం ఉండదు. అందుకే, ఈ–ఆఫీస్ ప్రక్రియను పకడ్బందీగా అమలు చేస్తున్నం. త్వరలో జిల్లా, మండల, గ్రామస్థాయిలో అమలు చేస్తం. ఆన్లైన్ ప్రక్రియను మరింత పకడ్బందీ చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నం.
– పంచాయతీరాజ్  డైరెక్టర్ సృజన