డైనమిక్ నేషనల్​ లీడర్ రాహుల్ గాంధీ

కాంగ్రెస్​ పార్టీ అగ్రనేత,  లోక్​సభ పక్షనేత రాహుల్ గాంధీ గొప్ప విజన్ ఉన్న లీడర్.  నానమ్మ, మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ, తండ్రి, మాజీ  ప్రధాని స్వర్గీయ రాజీవ్​గాంధీ.. స్ఫూర్తితో  కాంగ్రెస్​ అధినేత్రి సోనియాగాంధీ అనుభవాలతో  రాటుదేలారు. దేశ సమకాలీన పరిస్థితులను ఆకళింపు చేసుకుని తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్నారు.  కాబోయే భావి భారత ప్రధానిగా ప్రజలు భావిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో సఫలమవుతున్నారు. ఆ విషయాన్ని గత లోక్​సభ ఎన్నికల ఫలితాలే చెప్పాయి. బీజేపీని 240 స్థానాలకే కట్టడి చేయడంలో రాహుల్​ గాంధీ సక్సెస్​ కనిపించింది. అలాగే లోక్​సభలో  కాంగ్రెస్​ పార్టీ  బలాన్ని గణనీయంగా పెంచగలగిన  క్రెడిట్​ రాహుల్​కే దక్కుతుంది.  

రాహుల్​ గాంధీకి.. రైతులు, యువతకు అండగా నిలుస్తున్నారు. వారికి ఏ సమస్య వచ్చినా  నేనున్నానంటూ  భరోసా కల్పిస్తున్నారు.  దేశవ్యాప్తంగా కాంగ్రెస్​ పార్టీని బలోపేతం చేయడంలో  రాహుల్​గాంధీ ప్రణాళకాబద్ధమైన ప్రచారమే  కీలక భూమిక పోషిస్తున్నది. పార్టీని కేంద్రంలో అధికారంలోకి తీసుకు రావడమే రాహుల్​ ప్రధాన లక్ష్యం. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వస్తే సామాజిక, ఆర్థిక, రాజకీయ కులగణన జరిపి తీరుతామని అసెంబ్లీ ఎన్నికల ముందు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఈ వాగ్దానాన్ని నెరవెర్చేందుకే తెలంగాణ సీఎం రేవంత్​రెడ్డి, కాంగ్రెస్​ ప్రభుత్వం కులగణనకు శ్రీకారం చుడుతున్నది.  ఈరోజు రాహుల్​గాంధీ కులగణనపై మేధావులతో కలిసి చర్చిండానికి హైదరాబాద్​ వస్తున్నారంటే.. ఇచ్చిన హామీని అమలు చేయడంలో రాహుల్​గాంధీకి ఉన్న  ఆసక్తిని తెలియజేస్తున్నది.

భారత్​ జోడో యాత్రతో ప్రత్యేక గుర్తింపు

రాహుల్​ గాంధీకి భారత్​ జోడో యాత్రతో ప్రత్యేక గుర్తింపు లభించింది. యువత నుంచి చాలా ఆదరణ లభించింది. ఆయన సాదాసీదాగా ప్రజల్లోకి వెళ్లడం.. నేరుగా వారిని సమస్యలు అడిగి తెలుసుకోవడంతోపాటు ‘భారత్ జోడో యాత్ర’తో  ఆయన  దేశవ్యాప్తంగా  ప్రజలకు చేరువయ్యారు. ఈ యాత్ర ఆయన  ప్రజాకర్షణను మరింత పెంచింది. యువ నాయకులు, సామాజిక కార్యకర్తలు ఆయనను తమ మార్గదర్శకుడిగా భావిస్తున్నారు.

రాహుల్ గాంధీకి  ప్రజల్లో,  ముఖ్యంగా మధ్య తరగతి, యువత,  రైతుల్లో  విస్తృత ఆదరణ ఉంది.  ఆయన స్వచ్ఛమైన వ్యక్తిత్వం, నేరుగా  ప్రజల సమస్యలపై అవగాహన కలిగి ఉండడం ప్రజల్లో సానుకూలతను పెంచింది.  రాహుల్ గాంధీ భారత దేశంలో యువతకు స్ఫూర్తిగా నిలుస్తూ,  ప్రజాస్వామ్య పరిరక్షణకు అలుపెరగని కృషి చేస్తున్నారు. ఒక బలమైన జాతీయ నాయకుడిగా  ఆయన ఇప్పటికే
ఎదిగిపోయారు.  భారత రాజకీయాల్లో ఉన్నత విలువల కోసం పాటుపడుతూ యువతకు నాయకత్వ మార్గ నిర్దేశం చేస్తున్నారు. 

కాంగ్రెస్​ పార్టీలో యువశక్తి

యువతను ప్రోత్సహిస్తూ, కాంగ్రెస్ పార్టీలో కొత్త శక్తి, ఉత్సాహాన్ని నింపారు.  2007లో ఆయన యూత్  కాంగ్రెస్,  ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌యూఐను పటిష్టవంతంగా తయారుచేసి యువ నాయకత్వాన్ని తయారుచేశారు.  దేశంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే లక్ష్యంతో 2022 సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర  చేపట్టడం కాంగ్రెస్​  పార్టీకి చరిత్రాత్మక ఘట్టం. 

ఐదు మాసాల వ్యవధిలో 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా 4,080 కిలోమీటర్లు రాహుల్ పాదయాత్ర చేపట్టడంతో రాహుల్​కు దేశ ప్రజల పట్ల లోతైన అవగాహన మరింత పెరిగింది. ఆ అవగాహన 2024 లోక్​సభ ఎన్నికల ప్రచారంలో రాహుల్​కు బాగా ఉపయోగపడింది.  దేశరాజకీయ చరిత్రలో చారిత్రాత్మక పాదయాత్రగా భారత్​ జోడో యాత్ర నిలిచింది. ఆ యాత్రతో  తెలంగాణ ప్రజల సమస్యలను కూడా ఆయన లోతుగా అర్థం చేసుకోగలిగారు. 

మోదీ సర్కార్​ ప్రజావ్యతిరేక విధానాలపై ధ్వజం

రాహుల్ గాంధీ కేంద్రంలోని మోదీ సర్కార్​  ప్రభుత్వ  ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టడంలో సఫలమవుతున్నారు.  చైనా, -భారత్​  సంబంధాలు, ఆర్థిక వ్యవస్థ బలహీనతలు, పెట్రో ధరలు,  రైతుల సమస్యలు మొదలైన అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని  ఎప్పటికప్పుడు నీలదీస్తున్న తీరు పట్ల ప్రజలు రాహుల్​ గాంధీని ప్రశంసిస్తున్న తీరే రాహుల్​గాంధీ  భవిష్యత్​లో ప్రధాని కాబోవడం ఖాయమని చెపుతున్నది.

సన్న, చిన్న రైతులకు రుణమాఫీ, ఉపాధి కల్పన, విద్య వంటి మార్గదర్శక కార్యక్రమాలను చేపట్టారు. 2 024లో లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల సందర్భంగా ప్రజా సమస్యలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అనేకసార్లు నిలదీశారు. పార్లమెంట్​లో, బహిరంగ సభల్లో కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరంతరం ఎత్తిచూపుతున్నారు. తద్వారా ప్రజల గొంతుకగా పని చేస్తూ.. దేశంలో కాంగ్రెస్​పార్టీని పూర్వవైభవం వైపు నడిపిస్తున్నారనేది ఈ దేశ మేధావుల అభిప్రాయం కూడా. 

రాహుల్​ వాగ్దానం నెరవేరుతున్నవేళ..

తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వస్తే సామాజిక, ఆర్థిక, రాజకీయ కులగణన జరిపి తీరతామని అసెంబ్లీ ఎన్నికల ముందు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఈ వాగ్దానాన్ని నెరవెర్చేందుకు సీఎం రేవంత్​రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్​ ప్రభుత్వం కులగణనకు శ్రీకారం చుడుతున్నది. అనేక సమస్యలు చుట్టుముట్టినా.. ఇచ్చిన మాటను నిలుపుకోవాలనే పట్టుదలతో సర్కారు ఈ  నెల 6వ తేదీ నుంచి కుల
గణన చేపట్టనున్నది.

ఈనేపథ్యంలో ఇయ్యాల కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ తెలంగాణకు రానున్నారు.  హైదరాబాద్​ బోయిన్​పల్లిలోని  గాంధీ ఐడియాలజీ సెంటర్​లో కులగణనపై మేధావులు, పౌరహక్కులు, విద్యార్థి, కుల సంఘాల నేతలతో  సమావేశమవుతారు. ఈ మేరకు కులగణనపై  సూచనలు,  సలహాలు  స్వీకరించనున్నారు. వాస్తవాలు తెలుసుకునేందుకే రాహుల్​ గాంధీ సమావేశానికి వస్తున్నారు.  మొత్తానికి  చరిత్రలో  నిలిచిపోయే  కులగణనను  కాంగ్రెస్​ ప్రభుత్వం  చేపడుతుండడం  రాష్ట్ర  ప్రజలకు జరిగే గొప్ప మేలు.

సర్వేతో  రాజకీయాల్లో సమాన అవకాశాలతోపాటు , ప్రజలందరికీ సమ న్యాయం, హక్కులు పొందే అవకాశం ఉంది. మనకు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నవేళ.. రాబోయే కాలంలో రాహుల్​గాంధీకి అండగా ఉండాల్సిన అవసరాన్ని  గుర్తుచేస్తున్నది. వచ్చే పార్లమెంట్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ అఖండ విజయం సాధించే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి.   ప్రధానిగా రాహుల్​గాంధీని ఈ దేశం చూడబోతున్నదనడంలో సందేహం లేదు. తెలంగాణ ఇచ్చిన పార్టీ నేతగా రాహుల్​ గాంధీ హైదరాబాద్ ​రాకకు స్వాగతం పలుకుదాం.

- వెలిచాల రాజేందర్​రావు,
కాంగ్రెస్ ​పార్టీ కరీంనగర్​
పార్లమెంట్​ నియోజకవర్గ ఇన్​చార్జ్​