నీట్​పేపర్ లీకేజీకి ప్రధాని బాధ్యత వహించాలి : కోట రమేశ్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : నీట్ లీకేజీపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్ డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో  మంగళవారం డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నీట్ పరీక్షను రద్దు చేయాలని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నీట్ పరీక్ష లీకేజీపై తక్షణమే ప్రధాని మోదీ ప్రభుత్వం స్పందించి నిందితులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ పరీక్షను రద్దుచేసి మళ్లీ నిర్వహించాలన్నారు.

బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే పేపర్ లీకేజీలు ఎందుకు జరిగాయని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం విద్యారంగాన్ని గాలికి వదిలేసిందని,  పేపర్లు లీకేజీ అవుతున్నా పట్టించుకోవడంలేదని ఫైర్​అయ్యారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. డీవైఎఫ్ఐ, ఎస్​ఎఫ్​ఐ జిల్లా కార్యదర్శులు శివ వర్మ, తారా సింగ్, నేతలు సైదులు, ఆంజనేయులు, మహేశ్, రామకృష్ణ, బాలు పాల్గొన్నారు.