బతుకమ్మ పండుగొస్తే పూలతో బతుకమ్మను తయారుచేస్తారు. దీపావళికి దీపాలు వెలిగిస్తారు. ఒక్కో పండుగ ఒక్కోలా చేసుకుంటారు. అలాగే పాన్కేక్ల పండుగొస్తే తలమీద పాన్కేక్లు పెట్టుకుంటారు! ఇదేం పండుగ? ఇలా ఎవరు చేసుకుంటారు?
నెదర్లాండ్స్‌లోని రోటెర్డామ్లో ప్రతి ఏటా నవంబర్ 29న ‘డచ్ పాన్కేక్ డే’ జరుగుతుంది. అలాగే ఈసారి కూడా నెదర్లాండ్ ప్రజలు ఎంతో సంతోషంగా ఆ డే సెలబ్రేట్ చేసుకున్నారు. అందులో భాగంగా తలల మీద పాన్కేక్లు పెట్టుకుంటారు. ఇది దాదాపు 40 ఏండ్లుగా వస్తున్న ఆచారం. పాన్కేక్లను తలపై పెట్టకుని ‘సెయింట్ పాన్కేక్ శుభాకాంక్షలు’ అని చెప్పుకుంటారు.
ఇలా మొదలైంది
ఈ సెలబ్రేషన్స్1986లో మొదలైంది. డచ్ కార్టూనిస్ట్ జాన్ క్రూయిజ్ దీనికి నాంది పలికాడు. సాయంకాలం తండ్రి కోసం ఎదురుచూస్తున్న ఒక ఫ్యామిలీ... తండ్రి ఇంటికి వచ్చేటప్పటికి తల మీద పాన్కేక్లు పెట్టుకుని ఉన్నట్టు ఒక కార్టూన్ వేశాడు. ఆ కార్టూన్ అర్ధం – తమతో పాటు పాన్కేక్లు తినడానికి తండ్రికి ఇలా స్వాగతం చెప్పారన్నమాట. అయితే 30 ఏండ్ల తర్వాత ఈ ఐడియాని ‘ది గాస్పెల్ ఆఫ్ సెయింట్ పన్నెకోక్’ పేరుతో ఒక కథగా మార్చి చెప్పాడు ఆ కార్టూనిస్ట్. దాని గురించి మాట్లాడుతూ.. ‘కామిక్ స్టోరీస్‌లో చెప్పిన పండుగల్ని ఎవరూ జరుపుకుని ఉండరు. కానీ, దీన్ని మాత్రం30 ఏండ్లుగా చేస్తున్నారు. పైగా దీన్ని నేషనల్ హాలిడేగా ప్రకటించారు కూడా. మొదట దీన్ని కొందరు స్టూడెంట్స్ ఫాలో అయ్యారు” అని గతాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు.