విజయానికి ప్రతీక దసరా

ఆదిపరాశక్తిని  దేవిగా, దుర్గామాతగా,  భవానీమాతగా,  కాళీమాతగా ఇలా అనాదిగా వెయ్యినామాలతో భక్తకోటి స్తుతిస్తారు.  ఆలయంలో అమ్మవారి మూలవిరాట్టును కళ్ళారా సందర్శించుకుంటే...అమోఘ భక్తి పారవశ్యంలో మునిగిపోతారు.  త్రిదేవీ మాతల సమ్మేళనం.. అనగా లక్ష్మీ, సరస్వతి, పార్వతీ మాతలు ముగ్గురు కలిసి  ఒక రూపంగా మారిన మహోజ్వల అవతార మూర్తినీ ‘దేవీ’ అని స్తుతించారు.  అమ్మవారి కృపకు పాత్రులై విజయశక్తిని పొందడానికి పూర్వం దేవతలు, బుషులు  శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను ప్రతి ఏటా ఆశ్వీయుజ మాసంలో వైభవోపేతంగా నిర్వహిస్తూ ఆ పరంపరను శాశ్వతం చేశారు.

దీంతో అనాదిగా  భక్తకోటి  శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత  భక్తిశ్రద్ధలతో జరుపుకుంటూ జగన్మాత అనుగ్రహాన్ని పొందుతున్నారు.  త్రిశక్తి దేవతామాతలు పార్వతి, లక్ష్మి, సరస్వతులు.. మూడు అవతారాల చొప్పున 9 అవతారాలు దాల్చారు.  తమ అవతారాలకు....ధైర్య సాహసాలకు అధిదేవతగా దుర్గ,  ధనదేవతగా లక్ష్మి,  గురుదేవతగా  సరస్వతి బాధ్యతలు తీసుకున్నారు. 9 అవతారాల్లో మొదటి మూడు రోజులూ దుర్గాదేవి అవతారాలను, ఆతర్వాత మూడు రోజులు లక్ష్మిదేవి అవతారాలను, అటు తర్వాత మూడు రోజులు సరస్వతీదేవీ మూడు అవతారాలను పూజిస్తూ నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు.

ఈ క్రమంలో మొదటి మూడు రోజులు దుర్గా, బాలాత్రిపుర సుందరి, అన్నపూర్ణాదేవిలకు, రెండో  మూడు రోజులు గాయత్రీదేవి, లక్ష్మీదేవి,  సరస్వతీ దేవిలకు,  మూడో మూడు రోజులకు లలితామాత, మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరీమాతలకు అర్బనలతో 9 రోజులు వైభవోపేతంగా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు. 

దశహర.... దసరా

రాక్షస సంహారాల నేపథ్యంలో నవదుర్గల అవతారాలను దేవీ భాగవతం విపులీకరించింది. ఆ నవదుర్గల అవతారాలకు చిత్రకారులు, శిల్పాచార్యులు దివ్యమంగళ సుందరూపాలనిచ్చి ఆరాధింపజేయడంవల్ల వాటి ప్రామాణికంగా అనాదిగా దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. నవదుర్గల అవతారాలైన  శైలపుత్రి, బ్రహ్మచారిని, చంద్రఘంట, కూష్మాండదేవి, స్మందమాళిత, కౌత్యాయిని, కాళరాత్రి, మహాగౌరి,  సిద్ధిరాత్రి.... ఇలా  నవదుర్గలకు  నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం లోకాచారమైనది.

పది మంది రాక్షసులను కఠినంగా సంహరించినందున... ఆ దినాన్ని ‘దశహర’ అన్నారు. అది రానురాను వ్యవహారంలో దసరా అయింది. దేవీ సంహారాలకు తార్కానంగా దసరాను ప్రజలు  వైభవోపేతంగా జరుపుకుంటూ అమ్మవారికి ప్రీతి పాత్రులవుతున్నారు.

 విజయదశమి 

అమ్మవారు మహిషాసురినితో పాటు మొత్తం రాక్షసుల్ని ఈ 9 రాత్రుల్లోనే  వధించింది.  రాక్షసులకు బలం, మాయా, రాత్రివేళల్లోనే ఉంటుంది.  కాబట్టి అమ్మవారు కూడా రాత్రివేళల్లోనే వారితో యుద్ధం చేసి పదవనాటి ఉదయానికి సర్వరాక్షస వధను ముగించుకొని అఖండ విజయాన్ని సాధించిన ఆశ్వీయుజ దశమి దినం మహోన్నత ‘విజయ దశమి’ పర్వదినం అయింది. ఈ విధంగా చెడుపై విజయమే విజయ దశమిగా ప్రాశస్త్యాన్ని పొందింది. 

అమ్మవారి విజయ దశమి విజయోత్సవాల స్ఫూర్తితో దుర్మార్గులైన రావణ, కుంభ కర్ణాదులను  శ్రీరాముడు..  దుష్టదుర్యోధనాదులను పాండవులు  సంగ్రామాల్లో  సంహరించి  విజయాలు సాధించారు.  దీంతో విజయ దశమి విజయాలు చేకూర్చే  పండుగగా  నమ్ముతూ గొప్పగా  ప్రజలు జరుపుకుంటున్నారు. 

శమీవృక్షం, పాలపిట్ట,  గరుత్మంతులకు పూజలు 

 అజ్ఞాతవాస సమయంలో పంచ పాండవులు తమ ఆయుధాలను శమీవృక్షంపైన దాచారు. వాటికి సాక్ష్యంగా పాలపిట్ట,  గరుత్మంతుడు(గద్ద) ఉన్నారు. అజ్ఞాతవాసం ముగిసే వరకు తమ ఆయుధాలు, అలాగే తమ రహస్యాలు పరుల కంటబడకుండా.... ఆ విధంగా కాపాడినందుకు శమీవృక్షం (జమ్మిచెట్టు),  పాలపిట్ట,  గరుత్మంతులను పవిత్రంగా భావిస్తూ  కృతజ్ఞతాపూర్వకంగా పాండవులు వాటిని పూజించారు.

ఆ విధంగా పాండవుల పూజలందుకున్న ఆ మూడింటినీ దసరా రోజున  హిందువులు పవిత్రంగా, పూజనీయంగా భావిస్తూ శమీవృక్షానికి పూజలుచేసి అరిష్టాలు తొలగించుకుంటున్నారు. అలాగే  పాలపిట్టనూ, గరుత్మంతున్నీ సందర్శించుకొని పునీతులవుతున్నారు.

  

-తాళ్ళపల్లి యాదగిరి గౌడ్‌