బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో .. కూష్మాండదేవిగా జోగులాంబ అమ్మవారు

అలంపూర్, వెలుగు: జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. సహస్రనామార్చన, నవావరణఅర్చన, చండీ హోమం, అమ్మవారి దర్బారు సేవ నిర్వహించారు. సాయంకాలం దర్బారు సేవలో అమ్మవారిని నవదుర్గగా అలంకరించి కుమారి, సువాసిని పూజలు, మహా మంగళ హారతి, మంత్ర పుష్పం జరిపించారు.

అమ్మవారు నాల్గవ రోజు ఆదివారం కూష్మాండదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు స్థానికులతో పాటు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలతో పాటు సెలవు రోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉండాల్సి వచ్చింది.

అమ్మవారికి మంత్రి శ్రీధర్ బాబు పూజలు

జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శైలజా రామయ్యర్​ దంపతులు దర్శించుకున్నారు. వారికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. గణపతి పూజ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో అభిషేకం, పూజలు నిర్వహించారు. అనంతరం జోగులాంబ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అలంపూర్  ఎమ్మెల్యే విజయుడు, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్  మంత్రి తోపాటు ఆలయాల్లో పూజలో పాల్గొన్నారు. మంత్రికి తీర్థ ప్రసాదాలు అందజేసి, శేష వస్త్రాలతో సత్కరించి వేద ఆశీర్వచనాలను అందజేశారు. అలాగే నాగర్ కర్నూల్  ఎంపీ మల్లు రవి, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, డీసీసీబీ చైర్మన్  విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్  అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, మాజీ జడ్పీ చైర్ పర్సన్  సరిత తిరుపతయ్య స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.

కాంగ్రెస్​ నేతకు అస్వస్థత

మంత్రి శ్రీధర్ బాబు పర్యటన సందర్భంగా ఆలయానికి వచ్చిన మాజీ జడ్పీ చైర్​పర్సన్  సరిత భర్త తిరుపతయ్య ఆలయం ఆవరణలో అస్వస్థతకు గురయ్యారు. దర్శనం అనంతరం వేద ఆశీర్వచనాల ప్రాంగణంలో ఫిట్స్  రావడంతో కింద పడిపోయాడు. వెంటనే అక్కడున్న వారు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కర్నూల్ లోని ప్రైవేట్​ ఆసుపత్రికి తీసుకెళ్లారు.