బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో .. కాళరాత్రి దేవిగా జోగులాంబ అమ్మవారు

అలంపూర్, వెలుగు: జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బుధవారం సాయంత్రం దర్బారు సేవలో అమ్మవారికి నవదుర్గ అలంకారంతో  కొలువు నిర్వహించి కుమారి, సువాసిని పూజలు, మహా మంగళ హారతి, మంత్రపుష్పం జరిపించారు. జోగులాంబ అమ్మ వారు ఏడో రోజు కాళరాత్రి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు స్థానికులతో పాటు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. 

కమనీయంగా కల్యాణం..

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం మూల నక్షత్ర శుభ సందర్భంగా ఉదయం 10 గంటలకు జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి కల్యాణాన్ని జరిపించారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అలంపూర్  ఎమ్మెల్యే విజయుడు పాల్గొన్నారు. సాయంత్రం అమ్మవారికి సింహవాహన సేవ నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను జోగులాంబ జోన్  డీఐజీ ఎల్ఎస్  చౌహాన్, ఏపీ హైకోర్టు జడ్జి హరినాథ్, మహబూబ్ నగర్  కలెక్టర్  విజయేందిర బోయి,  ఎమ్మెల్సీ బల్మూర్  వెంకట్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.