రావణాసుర దహన కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు

  • రావణాసుర దహన కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు

సిద్దిపేట, మెదక్​, సంగారెడ్డి, వెలుగు: సిద్దిపేట జిల్లా  వ్యాప్తంగా శనివారం  దసరా సంబరాలు అంబరాన్నంటాయి. ప్రజలు జమ్మి చెట్టుకు పూజలు చేసి పాల పిట్ట దర్శనం చేసుకుని అలయ్ బలయ్ తీసుకున్నారు. హుస్నాబాద్ పట్టణంలో మిత్ర మండలి  నిర్వహించిన రామ్ లీలా కార్యక్రమంలో  మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రెండు దశాబ్దాల కింద ఆగిపోయిన రామ్ లీలా మళ్లీ తాను ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్నారు. ఇది ప్రతి ఏడాది జరిగేలా సహకరిస్తానన్నారు. నర్సాపూర్, రంగథాంపల్లి ల్లో  నిర్వహించిన రావణ దహణ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే  హరీశ్​రావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ త్వరలో సిద్దిపేట నుంచి బెంగుళూరు, తిరుపతిలకు  రైలు సర్వీసులు ప్రారంభమవుతాయని తెలిపారు. దుబ్బాక మండలం పొతారంలో నిర్వహించిన దసరా సంబరాల్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్​రెడ్డి  కుటుంబ సభ్యులతో పాల్గొని పాల పిట్ట దర్శనం చేసుకున్నారు. 

మెదక్​ టౌన్: జిల్లా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య దసరా పండుగ జరుపుకున్నారు. జమ్మిచెట్టుకు పూజలు చేసి పాలపిట్ట దర్శనం చేసుకున్నారు. పట్టణంలోని గవర్నమెంట్ కాలేజ్​ఆవరణలో జరిగిన రావణాసుర దహన కార్యక్రమంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్​రావు పాల్గొన్నారు.

 ఆయన మాట్లాడుతూ.. దుర్గామాత ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్​చైర్మన్​చంద్రపాల్, వైస్​చైర్మన్​మల్లికార్జున్​గౌడ్​, కౌన్సిలర్లు, దసరా ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్​ఆఫీసులో ఎస్పీ ఉదయ్​కుమార్​రెడ్డి ఆయుధాలకు, వాహనాలకు పూజలు చేశారు. ఆయన వెంట ఏఎస్పీ మహేందర్​, డీఎస్పీ ప్రసన్నకుమార్​, సీఐలు, సిబ్బంది ఉన్నారు.  

సంగారెడ్డి: జిల్లాలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే ప్రజలు ఆలయాలకు వెళ్లి  పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మండల కేంద్రాల్లో , గ్రామాల్లో  జమ్మి చెట్టు దగ్గర పూజలు నిర్వహించి పాలపిట్టను దర్శించుకున్నారు. వాహనాలకు, ఆయుధాలకు పూజలు చేశారు. పట్టణంలో  జరిగిన రావణాసుర దహనం కార్యక్రమానికి ఎక్కువ సంఖ్యలో జనాలు వచ్చారు. సినీ గాయకులు, కళాకారుల వేషధారణలు పలువురిని ఆకట్టుకున్నాయి. వేడుకలకు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హాజరై వేదిక మీద నుంచి పాలపిట్టను ఎగరవేశారు.