విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవ రాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ(శనివారం) దుర్గమ్మ రెండు ప్రత్యేక అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. అష్టమి, నవమి తిథులు ఉండటంతో రెండు అలంకారాల్లో కనువిందు చేశారు.
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఎనిమిదవ రోజుకు చేరుకున్నాయి. శనివారం అమ్మవారు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం12 గంటల వరకు దుర్గాదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మహిషాసురమర్దినిగా భక్తులకు కనువిందు చేశారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు క్యూలైన్లకు చేరారు. జగన్మాతకు ప్రీతిపాత్రమైన దుర్గాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఆన్‌లైన్‌లో టికెట్‌లు బుక్ చేసుకున్న 10వేల మంది భక్తులతో పాటు అంతకు రెండింతల మంది టికెట్‌లు తీసుకుని అమ్మవారి దర్శనానికి వచ్చారు. కరోనా నిబంధనల మధ్య దసరా శరన్నవరాత్రి వేడుకలు కొనసాగుతున్నాయి.
