దురాజ్ పల్లిలో లింగన్న జాతరకు కనీస వసతులు కరువు

  • ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర
  • ఈసారి పెద్దగట్టుకు 20 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా
  • జాతర గడువు దగ్గర పడుతున్నా.. పనులు ప్రారంభించని ఆఫీసర్లు

సూర్యాపేట, వెలుగు :  లింగన్న జాతరకు కనీస వసతులు కరువయ్యాయి. లింగమంతుల స్వామి జాతర తెలంగాణలో రెండో అతి పెద్దదిగా పేరొందింది. సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లి లోని లింగమంతులస్వామి జాతర నెల రోజుల్లో ప్రారంభంకానుంది. ఫిబ్రవరి2న దిష్టిపూజ చేసి 16న జాతర ప్రారంభమై20న ముగుస్తుంది. రెండేండ్ల ఒకసారి ఐదు రోజులపాటు జరిగే ఈ జాతరకు తెలంగాణతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, కర్నాటక, ఏపీ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. ఈసారి సుమారు 20 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. జాతరకు టైం దగ్గర పడ్తుండగా అభివృద్ధి పనులు మాత్రం ప్రారంభంకాలేదు. భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. 

కనిపించని పర్మినెంట్ వర్క్స్..

పెద్దగట్టు వద్ద శాశ్వత అభివృద్ధి పనులు చేస్తామని ప్రతిసారి జాతర సమయంలో ప్రజాప్రతినిధులు చెబుతూనే ఉన్నారు తప్ప.. ఏండ్లు గడుస్తున్నా ఆ హామీలు మాత్రం నెరవేర్చడం లేదు. జాతర రాగానే ఫండ్స్ కేటాయించి అప్పటికప్పుడు టెంపరరీ పనులు చేసి చేతులు దులుపుకొంటున్నారు. పర్మినెంట్ డెవలప్ మెంట్ వర్క్స్ పై శ్రద్ధ పెట్టడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతర సమయంలో వృద్ధులు, దివ్యాంగులు గుట్టపైకి మెట్లెక్కలేక ఇబ్బందులు పడుతున్నారు. కొండపై శాశ్వతంగా కల్యాణకట్ట, టాయిలెట్స్, మహిళల కోసం బట్టలు మార్చుకునే గదులు లేక భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

పాలకవర్గం ఏర్పాటుపై సందిగ్ధం..

పెద్దగట్టు ఆలయానికి పాలకమండలి ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 2023లో జాతర కోసం పాలక మండలిని ఏర్పాటు చేశారు. జాతర పూర్తయిన నాలుగు నెలలకే పదవీ కాలం ముగిసింది. ఇప్పటివరకు కొత్త పాలకవర్గాన్ని ఏర్పాటు చేయలేదు. 2015లో అధికారికంగా పాలకవర్గ కమిటీ ఏర్పాటు చేయగా, 2017, 2019లో జాతరలకు తాత్కాలిక కమిటీలు వేశారు. 2021లో అసలు కమిటీనే ఏర్పాటు చేయకుండా అధికారుల పర్యవేక్షణలో జాతర నిర్వహించారు. ఈ ఏడాది జాతర గడువు దగ్గర పడుతున్నా నేటికీ పాలకవర్గ కమిటీని ప్రకటించకపోవడంతో సందిగ్ధం నెలకొంది.