బాల్కొండ చుట్టూ డంపింగ్​ యార్డులే!

  • కేజీబీవీ, ఇంటిగ్రేటెడ్​హాస్టల్​స్టూడెంట్స్​ఆరోగ్యంపై ఎఫెక్ట్​
  • సేకరించిన చెత్త  మాంసం వ్యర్థాలను తగలబెడుతున్న శానిటేషన్​  సిబ్బంది
  • నిరుపయోగంగా పంచాయతీ డంపింగ్​యార్డు 

నిజామాబాద్, వెలుగు: జిల్లాలోని బాల్కొండ మేజర్​ గ్రామ పంచాయతీలో పారిశుధ్య సమస్య ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.  రోజూ సేకరించిన చెత్త, జీవాల వ్యర్థాలను శానిటేషన్​ సిబ్బంది డంపింగ్​ యార్డులో వేయకపోవడంతో  కుక్కలు జీవాల వ్యర్థాలను నోట కరుచుకొని తిరిగి ఊర్లోకి తెస్తున్నాయి. రెండు రోజులకోసారి చెత్తకుప్పలను తగులబెడుతుండటంతో  గ్రామస్తులుపొగతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. లోకల్​గా ఉన్న కేజీబీవీ, ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్​ హాస్టల్​ పరిసరాలను డంపింగ్​ యార్డులా వాడుతుండటంతో  స్టూడెంట్స్​ అవస్థపడుతున్నారు.  గ్రామం చుట్టూ పరిసరాలు డంపింగ్​గా మారడంతో వారి ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్న పేరెంట్స్​ పిల్లల చదువు మాన్పించే ఆలోచన ఉన్నారు. 

డంపింగ్​ యార్డు అలవాటు కాలేదు

మండల కేంద్రమైన బాల్కొండ మేజర్​ పంచాయతీలో దాదాపు16 వేల జనాభా ఉంది.  ఏటా కొత్త కాలనీలు విస్తరిస్తున్నాయి. విలేజ్​లోని 60 శాతం  మంది మహిళలు బీడీలు చుడుతుంటారు. దీంతో కట్​ చేసిన బీడీ ఆకులు కుప్పలుకుప్పలుగా  తయారవుతోంది. 20 చికెన్​, ఐదు మటన్​ దుకాణాలు, 30 పడకల కెపాసిటీతో కమ్యూనిటీ హెల్త్​ సెంటర్, 15  ఆర్​ఎంపీ, పీఎంపీ క్లినిక్​లు ఉన్నాయి. ఐదు ట్రాక్టర్ల ద్వారా  చెత్త సేకరిస్తున్న 25 మంది పంచాయతీ సిబ్బంది గల్లీ చివరన చెత్తను పారబోస్తున్నారు. 

గురువారం అంగడి ముగిశాక టన్నుల కొద్దీ కుళ్లిన వెజిటెబుల్స్​, చెత్తను సేకరించి కుప్పలుగా పోస్తున్నారు. కిలో మీటర్​ దూరంలోని డంపింగ్​ యార్డుకు వెళ్లడం భారంగా భావిస్తూ ఇష్టరీతిన ప్రవర్తించడంతో సమస్యగా మారింది.  కంపౌండ్​వాల్​ లేని ఇంటిగ్రేటెడ్​ హాస్టల్​ సమీపంలో చెత్తను వేయడంతో ఆహారం కోసం కుక్కలు గుమిగూడుతున్నాయి. దీంతో హాస్టల్​ స్టూడెంట్స్​ భయపడుతున్నారు. 364 మంది విద్యార్థులున్న కేజీబీవీ  హాస్టల్​కు కేవలం వంద మీటర్ల దూరంలో చెత్తకుప్పలు దుర్గంధం వెదజల్లుతున్నాయి. దుర్వాసన భరించలేక పోతున్ఆనరు.  పొగతో బేజారవుతున్నారు. ముఖ్యంగా దవాఖానాల నుంచి సేకరించిన వ్యర్థాలను సురక్షిత పద్ధతిలో నిర్వీర్యం చేయాలి. అలా కాకుండా తగులబెట్టడం ఆందోళన కలిగిస్తోంది. 

పర్యవేక్షణ లోపం

రూ.60 లక్షల ట్యాక్స్​ రావాల్సిన బాల్కొండ పంచాయతీలో పన్ను వసూళ్లు కేవలం 20 శాతమే జరిగాయి. దీంతో ఫైనాన్స్​ సమస్య తలెత్తి శానిటేషన్​ సిబ్బందికి రెగ్యులర్​గా జీతాలు ఇవ్వడంలేదు. ఈనెల 23న మార్చి  జీతం చెల్లించారు.  మిగిలిన నెలల జీతభత్యాలు పెండింగ్​ ఉన్నాయి. స్పెషల్​ ఆఫీసర్, స్పెషల్​ గ్రేడ్​ సెక్రటరీ ఉన్నప్పటికీ వారి అజమాయిషీ లోపం స్పష్టంగా కనబడుతోంది. 

లెటర్​ రాశా

చెత్తకుప్పలు, పొగతో స్టూడెంట్స్​ చాలా ఇబ్బందిపడుతున్నారు. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత మంది పేరెంట్స్​ హాస్టల్​ నుంచి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. హాస్టల్​ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని విలేజ్​ సెక్రటరీకి లెటర్​ రాశాను.

గంగాకిషన్​, వార్డెన్​,  ఇంటిగ్రేటెడ్  హాస్టల్

 

డంపింగ్​ యార్డు వినియోగానికి ఆర్డర్స్​

సర్వేల పని ఒత్తిడితో సిబ్బందిని సరిగా పర్యవేక్షించలేకపోయా. ఇక నుంచి డంపింగ్​ యార్డు వినియోగంపై దృష్టి సారిస్తా.  ప్రజలు, స్టూడెంట్స్​కు ఇబ్బందికి లేకుంటా శానిటేషన్​ సిబ్బందికి తక్షణ ఆదేశాలు జారీ చేస్తా. 

రజినీకాంత్​రెడ్డి, స్పెషల్​ గ్రేడ్​ సెక్రటరీ