హైదరాబాద్: విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలను క్లియర్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే చెప్పారని.. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి సీతక్క మండలిలో ప్రకటించారు. కాగా బీఆర్ఎస్ పాలనలో గత ఐదేళ్లలో 2019-20 లో 40 కోట్లు, 2020- -21 లో 209 కోట్లు, 2021- -22 లో 981 కోట్లు, 2022- -23 లో 2120 కోట్లు, 2023- -24 లో 1845 కోట్లు.. మొత్తం రూ. 5197 కోట్ల మేర ఫీజు బకాయిలు పేరుకుపోయాయని వివరించారు.
చదువుకోలేని పేద పిల్లలకు చదువు భారం కాకుడదనే ఉద్దేశంతో, పేద వర్గాల పిల్లలకు కార్పోరేట్, ఉన్నత విద్యను అందించాలనే గొప్ప లక్ష్యంతో 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. ఈ పథకంతో ఎంతో మంతి పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివి, ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పథకం అమలులో ఉన్నప్పటికీ.. దానిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. సకాలంలో ఫీజులు చెల్లించకపోవడంతో వేల కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని చెప్పుకొచ్చారు.