ధాన్యం దారిమళ్లిస్తే  కఠిన చర్యలు..క్రిమినల్ కేసులు నమోదు చేస్తం: డీఎస్ చౌహాన్

హైదరాబాద్, వెలుగు: ధాన్యం దారి మళ్లితే ఉపేక్షించబోమని సివిల్ సప్లయ్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ డీఎస్ చౌహాన్ హెచ్చరించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు శుక్రవారం మీడియాకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘రైస్ మిల్లర్ల వద్దకు చేరిన ధాన్యం నిల్వలపై ఎన్​ఫోర్స్​మెంట్ వింగ్ ద్వారా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నం. గడిచిన నాలుగు రోజుల్లో 11 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. పలువురిని అరెస్ట్ చేసినం.

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తున్నది. డిఫాల్టర్లను దూరం పెట్టినం. ధాన్యం దారి మళ్లింపునకు అవకాశం ఉండదని రైస్ మిల్లర్ల అసోసియేషన్స్ ప్రభుత్వానికి మాట ఇచ్చినయ్. ధాన్యం మిల్లింగ్, సీఎంఆర్ బియ్యం డెలివరీలతో ఇటు కార్పొరేషన్.. అటు మిల్లర్లు లబ్ధి పొందొచ్చు. అయితే, కొందరు రైస్ మిల్లర్లు మాత్రం సీఎంఆర్ దారి మళ్లిస్తూ అవినీతికి పాల్పడుతున్నరు’’అని డీఎస్ చౌహాన్ ఆరోపించారు. అలాంటి వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తదని పేర్కొన్నారు.