LB నగర్‎లో భారీ డ్రగ్ ముఠా గుట్టు రట్టు.. కోటి 25 లక్షల పాపిస్ట్రాప్ సీజ్

హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీ నగర్‎లో ఎస్వోటీ పోలీసులు భారీ డ్రగ్ రాకెట్‎ను ఛేదించారు. సోమవారం (డిసెంబర్ 16) తెల్లవారుజూమున మధ్యప్రదేశ్ నుండి హైదరాబాద్‎కు మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను మీర్‌పేట్ పోలీసులతో కలిసి ఎల్బీనగర్ జోన్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. 53.5 కేజీల నార్కోటిక్ పాపిస్ట్రాప్ డ్రగ్‎ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సీజ్ చేసిన డ్రగ్ విలువ 1 కోటి 25 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం (డిసెంబర్ 16) ఉదయం 11:30 గంటలకు ఎల్బీనగర్ క్యాంప్ ఆఫీసులో రాచకొండ సీపీ సుధీర్ బాబు మీడియాకు వెల్లడించనున్నారు.

రాష్ట్రంలో డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలపై  ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో డ్రగ్స్ అన్న మాటే వినబడకూడదని.. తెలంగాణను డ్రగ్ ఫ్రీ స్టేట్‎ గా మార్చేందుకు కృషి చేయాలని సూచించారు. సీఎం ఆదేశాలకు మేరకు రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణా, స్మగ్లింగ్‎పై పోలీసులు సీరియస్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ స్మగ్లర్ల భరతం పడుతున్నారు. ఇందులో భాగంగానే సోమవారం ఎల్బీ నగర్‎లో సోదాలు చేస్తుండగా.. భారీ రాకెట్ ముఠా పట్టుబడింది.