22 మీటర్లు డ్రిల్లింగ్ పూర్తి .. ఉత్తరాఖండ్ టన్నెల్​లో కొనసాగుతున్న రెస్క్యూ పనులు

22 మీటర్లు డ్రిల్లింగ్ పూర్తి     ..  ఉత్తరాఖండ్ టన్నెల్​లో కొనసాగుతున్న రెస్క్యూ పనులు

ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్ లోని టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లోపలికి స్టీల్ పైపులను పంపించేందుకు రెస్క్యూ సిబ్బంది రాత్రీపగలు పని చేస్తున్నారు. టన్నెల్ కూలిన చోట భారీ డ్రిల్లింగ్ మెషిన్ తో తవ్వుతున్నారు. ఇప్పటి వరకు 22 మీటర్ల మేర తవ్వినట్టు నేషనల్ హైవేస్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ హెచ్ఐడీసీఎల్) డైరెక్టర్ అన్షు మనీశ్ ఖల్ఖో శుక్రవారం తెలిపారు. 

మొత్తం 60 మీటర్ల మేర డ్రిల్లింగ్ చేయాల్సి ఉందని చెప్పారు. ‘‘కార్మికులను బయటకు తీసుకురావడానికి ఎస్కేప్ రూట్ రెడీ చేస్తున్నాం. ఇప్పటి వరకు నాలుగు పైపులు లోపలికి పంపించాం. ఇప్పుడు ఐదో పైపును పంపిస్తున్నాం” అని పేర్కొన్నారు. టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులంతా క్షేమంగా ఉన్నారని, వాళ్లకు ఆహారం అందజేస్తున్నామని నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ పీఆర్వో జీఎల్ నాథ్ తెలిపారు.

 ‘‘ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్స్ లో అనుభవం ఉన్న విదేశీ నిపుణులతోనూ మాట్లాడుతున్నాం. సలహాలు, సూచనలు తీసుకుంటున్నాం. ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన భారీ డ్రిల్లింగ్ మెషిన్ బాగా పని చేస్తోంది” అని చెప్పారు.