హైదరాబాద్, వెలుగు : డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ కన్సాలిడేటెడ్ నికర లాభం సెప్టెంబర్ 2022 క్వార్టర్లో 12 శాతం పెరిగి రూ. 1,129 కోట్లకు చేరింది. అంతకు ముందు ఏడాది సెకండ్ క్వార్టర్లో కంపెనీ నికరలాభం రూ. 992 కోట్లే. సీక్వెన్షియల్‌గా చూస్తే మాత్రం డాక్టర్ రెడ్డీస్ నికరలాభం 6 శాతం తగ్గిపోయింది. నార్త్ అమెరికా బిజినెస్ గ్రోత్ కారణంగానే మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఈ మార్కెట్లో కొత్త ప్రొడక్టులు లాంచ్ చేయడంతో పాటు, ఫారెక్స్ రేట్లు కూడా డాక్టర్ రెడ్డీస్‌కు కలిసొచ్చాయి. తాజా క్వార్టర్లో కంపెనీ గ్రాస్ మార్జిన్లూ కొంత మెరుగయ్యాయి. తాజా క్యూ2లో కంపెనీ రెవెన్యూ అంతకు ముందు ఏడాది క్యూ2లోని రూ. 5,763 కోట్ల నుంచి రూ. 6,306 కోట్లకు పెరిగింది. అంటే ఈ సెప్టెంబర్ క్వార్టర్లో కంపెనీ ఆదాయం 9 శాతం ఎక్కువైంది. ఇక సీక్వెన్షియల్‌గా చూస్తే ఈ ఆదాయం 21 శాతం పెరిగింది. డాక్టర్ రెడ్డీస్ గ్రాస్ మార్జిన్లు తాజా సెప్టెంబర్ క్వార్టర్లో మెరుగుపడి 59.1 శాతానికి చేరాయి. అంతకు ముందు ఏడాది ఇవి 53.4 శాతమే.
జెనిరిక్స్ బిజినెస్ బాగుంది...
గ్లోబల్ జెనిరిక్స్ బిజినెస్ రెవెన్యూ 18 శాతం పెరిగి రూ. 55.9 బిలియన్లకు చేరినట్లు సీఈఓ ఎరిక్ ఇజ్రేల్ వెల్లడించారు. అంతకు ముందు ఏడాది రెండో క్వార్టర్‌తో పోలిస్తే ఇది 18 శాతం ఎక్కువని పేర్కొన్నారు. లినాలిడోమైడ్ క్యాప్సూల్స్ అమ్మకాలు రానున్న క్వార్టర్లో మరింత పెరుగుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ జెనిరిక్ డ్రగ్ కోసం ఇన్నొవేటర్తో వాల్యూమ్ లిమిటెడ్ సెటిల్మెంట్ కుదుర్చుకున్నట్లు ఆయన చెప్పారు. రష్యా అమ్మకాలు బాగా మెరుగుపడుతున్నాయని కూడా వివరించారు. జెనిరిక్స్ మార్కెట్లలో రేట్లు తగ్గడం వల్ల గ్రోత్ కొంత ఎఫెక్ట్ అయిందని అన్నారు. కొవిడ్ ప్రొడక్టుల సేల్స్ దాదాపుగా నిలిచిపోయినట్లేనని పేర్కొన్నారు. రెవెన్యూలో నార్త్ అమెరికా నుంచి రూ. 28 బిలియన్లు, యూరప్ నుంచి రూ. 4.2 బిలియన్లు, ఎమర్జింగ్ మార్కెట్ల నుంచి రూ. 12.2 బిలియన్లు, దేశీయ మార్కెట్ నుంచి రూ. 11.5 బిలియన్లు వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. తాజా సెప్టెంబర్ క్వార్టర్లో మొత్తం 10 కొత్త ప్రొడక్టులను వివిధ దేశాలలో లాంఛ్ చేసినట్లు పేర్కొంది.
సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ మెరుగ్గా ఉన్నాయి. యూఎస్ మార్కెట్లో లినాలిడోమైడ్ క్యాప్సూల్స్ లాంఛ్ చేశాం. కొత్త ప్రొడక్టులు తెచ్చేందుకు నిరంతరం ప్రయత్నాలు సాగిస్తున్నాం. ప్రాఫిటబిలిటీ, ఇన్నొవేషన్, సస్టెయినబిలిటీలలో ముందడుగు వేస్తున్నాం.
‑ జీ వీ ప్రసాద్, కో ఛైర్మన్
