ప్రతిపక్షంగా బీఆర్ఎస్​ విఫలం.. అసలు ప్రతిపక్షమంటే...?

నెహ్రూ భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామ్యానికి అత్యున్నత రూపమైన సెక్యులరిజం, సెమీ సోషలిజం, ప్రభుత్వరంగాన్ని బలోపేతం చేయడంలాంటివి ఖచ్చితంగా పాటించేవారు. అనేక సంస్థానాలుగా విడిపోయున్న భారతదేశాన్ని ఐక్యంచేసిన ప్రజాస్వామికవాది నెహ్రూ. కుల, మత విభేదాలతో, అంతర్గత కలహాలతో, మత విద్వేషాలతో రగిలిపోతున్న దేశాన్ని నవభారత నిర్మాణదిశగా మలుపుతిప్పాడు. ప్రతిపక్షాలను గౌరవించాడు. 

బలమైన ప్రతిపక్షం, ప్రశ్నించే ప్రతిపక్షం ఉండాలని కోరుకున్నాడు.  ప్రతిపక్ష పార్టీకి చెందినవాడైనా మంచి పార్లమెంటేరియన్‌‌‌‌ కాబట్టి వాజ్‌‌‌‌పేయ్‌‌‌‌లాంటివారు గెలవడాన్ని స్వాగతించాడు. రాజకీయ విలువలకు పట్టం కట్టి ప్రజాస్వామ్యాన్ని సోషలిజాన్ని, సెక్యులరిజాన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలన సాగించాడు. నెహ్రూ పంథానే కాంగ్రెస్‌‌‌‌  అనుసరించింది.

క్రమక్రమంగా అనేక ప్రాంతీయ పార్టీలు రావడం,  సంప్రదాయ మతతత్వ పార్టీలు బలం పుంజుకోవడం వల్ల కాంగ్రెస్‌‌‌‌,  కమ్యూనిస్టు పార్టీలు బలహీనపడ్డాయి.  కొన్ని పార్టీల విభజించు, పాలించు పాలనా విధానం వల్ల కనుమరుగైపోతున్న కులతత్వం, మతతత్వం విశృంఖల విహారం మొదలైంది.  నెహ్రూ వేసిన నవభారత, సెక్యులర్‌‌‌‌ భారత పునాదులు, భవనాలను కూల్చివేస్తూ  కులభారత, మతభారతాలను సమర్థించే పార్టీలు అధికారంలోకి రావడం ప్రారంభమైంది. ఫెడరలిజం, గణతంత్రం, సెక్యులరిజం, సోషలిజం పదాలు తిట్టుపదాలన్నంతగా మారి రాజకీయ విలువలు దిగజారడం ప్రారంభమైంది. ఎలాగైనా సరే ప్రాంతీయ, మత, కుల సెంటిమెంట్లను రెచ్చగొట్టయినా సరే అధికారంలోకి రావడం పరమావధి అయింది. 

తెలంగాణ కోసం వేలాదిమంది ప్రాణత్యాగాలు
రాజకీయాల ద్వారా దేశానికి తామేమిస్తున్నాం, ఏ మౌలిక మార్పులకు దోహదం చేస్తున్నాం అని కాకుండా రాజకీయాల ద్వారా ఏం పొందుతున్నాం ఎంత సంపాదిస్తున్నామన్నదే ప్రధానమైంది. రాజకీయాలు ఓ లాభసాటి ప్రక్రియగా సులభంగా కోట్లు ఆర్జించే సాధనంగా మారిపోయింది. ఇలాంటి రాజకీయాలను బాగా  ఒంటపట్టించుకున్న పార్టీ నేటి బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌. 

తెలంగాణ కోసం దశాబ్దకాలంగా పనిచేస్తున్నవారిని, మేధావులను, రచయితలను పక్కన పెట్టి తెలంగాణ కోసం పుట్టిన ఉద్యమ పార్టీగా తనను తాను ప్రకటించుకొని రాజకీయపార్టీగా అవతారమెత్తింది.  తెలంగాణ కోసం ఒక్క  కేసీఆర్ మాత్రమే కాదు తెలంగాణ కాంగ్రెస్‌‌‌‌ నాయకులు, అనేకమంది మేధావులు, విద్యార్థులు, కోట్లమంది తెలంగాణ ప్రజలు పోరాడారు.  వేలాదిమంది జైళ్ళకెళ్లారు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించారు.

సామాజిక  తెలంగాణ, ప్రజల తెలంగాణ, బహుజనుల తెలంగాణ అన్నవారి నోళ్ళు మూయించి ముందయితే భౌగోళిక  తెలంగాణ అని అందర్నీ నమ్మించాడు. తెలంగాణ భాషా చమక్కులతో, వాక్చాతుర్యంతో ఎంతోమంది త్యాగాలను పేరుకు లేకుండా చేసి తానొక్కడే తెలంగాణ తెచ్చినవాడిగా ప్రచారం చేసుకున్నాడు. 1200మంది అమరవీరుల త్యాగఫలంగా, కాంగ్రెస్‌‌‌‌ తెలంగాణ అవసరాన్ని అధిష్టానానికి సరిగ్గా విడమర్చి చెప్పడం వల్ల, సోనియా గాంధీ, మీరాకుమార్​, సుష్మాస్వరాజ్‌‌‌‌ ముగ్గురు స్త్రీల  చలువ వల్ల తెలంగాణ సాధ్యమైంది. టీఆర్​ఎస్‌‌‌‌. కంటె ఎక్కువ సిన్సియర్‌‌‌‌గా కాంగ్రెస్‌‌‌‌ తెలంగాణ సమస్యను బలంగా అధిష్టానానికి అర్థం చేయించడం వల్లనే కాంగ్రెస్‌‌‌‌ పార్టీ తెలంగాణ ఇచ్చింది.. కానీ,  అత్యంత చాకచక్యంగా తెలంగాణ సాధించిన ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు  కేసీఆర్.

తొమ్మిదిన్నరేండ్లు నియంతృత్వ పాలన
దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి, పేదలకు డబుల్‌‌‌‌ బెడ్‌‌‌‌రూం ఇండ్లు,  నీళ్లు,  నిధులు,  నియామకాల ప్రచారంతో ఎన్నికల్లో బొటాబొటి మెజారిటీతో గెలువగలిగాడు  కేసీఆర్.  ఇతరుల త్యాగాల ఫలితంగా గెలిచిన  కేసీఆర్​ తన గెలుపును తెలంగాణ అభివృద్ధి కోసం కాకుండా కుటుంబ అభివృద్ధి కోసమే ఉపయోగించుకున్నాడు.  తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వారినందరినీ అణగదొక్కాడు.  ప్రశ్నించిన వారిని నిర్చంధించాడు. ధర్నాలు చేసుకునే అవకాశం కూడా  ఇవ్వకుండా ధర్నా చౌక్‌‌‌‌ను  మూసేశాడు.  ప్రగతి భవన్‌‌‌‌ చుట్టూ బ్యారికేడ్లు నిర్మించి ఎవరికీ ప్రవేశం కల్పించలేదు. 

తొమ్మిదిన్నరేండ్ల పాటు కుటుంబ పాలన నిర్వహించి  వలస  పాలనలో  ముప్పైవేల కోట్లు   మిగులుంటే రాష్ట్రంపై  ఏడులక్షల కోట్ల అప్పుల భారాన్ని మోపాడు. ఏ విషయంపై ఎవరినీ నోరు మెదపనివ్వలేదు. కనీసంగా మాట్లాడే హక్కు కూడా లేదు. రాష్ట్రంలో ప్రతిపక్షమంటూ లేకుండా చేసి హిట్లర్‌‌‌‌లా నియంతృత్వ పాలన చేశాడు.  రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచాడు. రాష్ట్రంలో పరిపాలన అనేదే లేకుండా చేసి కుటుంబ పాలనతో  దివాలా తీయించాడు.  నలభై వేల కోట్లతో పూర్తి చేయాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్షా నలభై వేల కోట్ల పెంచి ముంచడం...  ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చకపోవడం. నిరుద్యోగం... వీటన్నింటినీ ప్రజలకు స్పష్టంగా అర్థం చేయించగలిగింది కాబట్టే, కాంగ్రెస్‌‌‌‌ 2023 ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది.

ప్రతిపక్షంగా బీఆర్ఎస్​ విఫలం
2024 పార్లమెంట్‌‌‌‌ ఎన్నికల్లో  బీఆర్ఎస్​ ఒక్క పార్లమెంట్‌‌‌‌  సీటును కూడా పొందలేకపోయింది.  రాష్ట్రం పీకలలోతు అప్పుల భారంతో ఉన్నా కాంగ్రెస్‌‌‌‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే ఉంది.  బీఆర్ఎస్​ పది సంవత్సరాల కాలంలో చేయని పనులను రేవంత్‌‌‌‌ రెడ్డి ప్రభుత్వం పదినెలల్లో చేసి చూపిస్తోంది. బీఆర్ఎస్​ చేసిన ఏడున్నర లక్షల కోట్ల అప్పులకు వడ్డీ చెల్లించడం,  విద్యుత్‌‌‌‌ బాకీలు చెల్లించడంతోపాటు బడ్జెట్‌‌‌‌ లోటును పూడ్చడానికి, వాగ్దానాలు నెరవేర్చడానికి సర్వప్రయత్నాలు చేస్తోంది.  ధరణి అవకతవకలు సవరించి పేదల భూములు పేదలకు అప్పగించే పనిలోనూ ఉంది. 

జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న బీఆర్ఎస్​ నాయకులు తమతప్పులకు పశ్చాత్తాపం కూడా ప్రకటించడం లేదు.  అధికారపక్షంగా ఘోరంగా విఫలమై ఇదివరకు దేశంలో ఏ పార్టీ చేయనంత అధ్వాన, అవినీతిమయ పాలన చేసిన బీఆర్​ఎస్​ ప్రతిపక్షంగానూ ఘోరాతిఘోరంగా విఫలమవుతోంది. ప్రతిపక్షమంటే ప్రజలపక్షం, న్యాయపక్షం వహించి  మాట్లాడటం కాకుండా ...ప్రభుత్వం చేస్తున్న ప్రతి మంచి పనినీ బాధ్యతారహితంగా విమర్శించడంగా మార్చిన బీఆర్ఎస్​ త్వరలో నామరూపాల్లేకుండా పోవడం ఖాయం. చట్టం తన పనిని తాను చేసుకుపోతుంది.

- డా. కాలువ మల్లయ్య