దావోస్ ఓ విహార యాత్ర! పెట్టుబడులు తెస్తున్నట్లు ఫొటోల్లో ఫోజులు

తెలంగాణా రాష్టంలో ఆర్థిక వ్యవస్థ మీద, దాని గతి మీద, దిశ మీద ఎట్లాంటి చర్చ జరగడం లేదు. ఉద్యమం సమయంలో రాష్ట్రం తెచ్చుకుందామన్నారు. తెచ్చుకున్నాక విధానాల రూపకల్పనకు రాజ్యాంగంలో ఏర్పరిచిన ఏ ఒక్క ప్రభుత్వ సంస్థను కూడా ఈ దిశగా కదిలించలేదు. తెలంగాణ శాసన మండలి, శాసన సభ, ప్రణాళికా సంఘం, తెలంగాణా మౌలిక సదుపాయాల సంస్థ వంటివి ఉన్నా అవి ఏవీ విధానాల రూపకల్పన వేదికలుగా, వాహకాలుగా వాడలేదు. ఆయా సంస్థలు అన్ని నిశ్శబ్దంగా, స్తబ్దుగా ఉన్నాయి.

అసందర్భ, అనాలోచిత ఆర్థికాభివృద్ధి విధానాలకు కనీసం మమ అని కూడా అనడం లేదు. నిరుద్యోగం పెరుగుతుంటే మూస మాటలు, శుష్క హామీలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల మీదనే చర్చ కేంద్రీకరించి ఏదీ చేయకుండా కాలయాపన చేస్తున్నారు పాలకులు. నిరుద్యోగం కేవలం యువతలోనే లేదు. సాంప్రదాయ వృత్తులు చేసుకునే కుటుంబాల వారు కూడా పని లేక అల్లాడుతున్నాయి.

గత పది యేండ్ల నుంచి దావోస్ సదస్సుకు తెలంగాణా ప్రభుత్వ ప్రతినిధులు పోతున్నరు. వస్తున్నరు. వీళ్ళు అక్కడికి పోతున్నది విధానాల సాధ్యాసాధ్యాల గురించి చర్చించడానికా, సైద్ధాంతిక బోధనలు వినడానికా, నిధులు తేవడానికా, తెలంగాణా రాష్ట్రాన్ని పెట్టుబడుల స్వర్గంగా అమ్మడానికా? ఇవన్నీ కూడా ఉన్నాయా? ఇంకేమి లక్ష్యాలతో వెళుతున్నారు? జాతీయ అభివృద్ధి మండలి వగైరా సమావేశాలను కూడా అప్పుడప్పుడు ఎగ్గొట్టే వారు సైతం క్రమం తప్పకుండా ఈ వార్షిక సమావేశాలకు మాత్రం పోవడానికి అక్కడున్న ఆకర్షణ ఏమిటి? 

పెట్టుబడులు తెస్తున్నట్లు ఫొటోల్లో ఫోజులు
దావోస్ పది వేల మంది స్థిర నివాసులు ఉండే ఒక చిన్న గ్రామం. యేటా ఇక్కడ ప్రపంచ వాణిజ్య వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) పేరిట ఒక ప్రైవేటు సంస్థ నిర్వహించే సమావేశాలకు వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు హాజరు  అవుతుంటారు. కీర్తి యావ ఉన్నవాళ్ళు, వ్యాపార సంబంధాలు పెంచుకోవడానికి పోతుంటారు. మన దేశ ప్రభుత్వ నాయకులు పెట్టుబడులు తీసుకురావడానికి పోతున్నాము అంటారు. లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు అయినట్లు అక్కడ నుంచే ఫోటోలు పెడతారు. ఇంటికి వచ్చినాక ఆ ఒప్పందాలు ఏవి ప్రజలకు చూపెట్టరు.  ఇక్కడి వ్యాపారవేత్తలు, ఇక్కడి పాలకులు అక్కడికి పోయి ఏవో కాగితాలు మార్చుకుంటున్నట్లు  పోజులు ఇచ్చి వస్తారు. ప్రజా ధనం కోట్లు ఖర్చు పెడతారు.

ఆంధ్ర భోజనం, తెలంగాణా భోజనం అంటూ అటు నుండి పోయే వ్యాపారవేత్తలను పిలుచుకుని రావడానికి కొందరు వ్యక్తులను, సంస్థలను నియమించుకుని, వాళ్ళు ‘భోజనానికి’ వస్తే నాయకులు ఫోటోలు దిగి పంపిస్తున్నారు.  మన దేశం నుండి కొన్ని ప్రధాన రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇదొక వార్షిక విహారయాత్రగా మారింది. వ్యాపారవేత్తల సమావేశాలకు వెళ్లి మన నాయకులు అడుక్కునే బొచ్చెలు పట్టుకునే ఖర్మ ఎందుకు పట్టింది? 

ప్రజాధనం వృథా
దావోస్ లో ఉన్న ఆకర్షణల మీద మీడియా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. డిల్లీకి ఎన్నిసార్లు పోయిండ్రు అని, కాళ్ళు మొక్కిండా, చేతులు పట్టుకున్నాడా అని విశ్లేషించే మీడియా అదేమి విచిత్రమో దావోస్ గురించి మాత్రం ప్రజల గొంతుకలుగా మారలేదు. దావోస్ సమావేశాలకు వెళుతున్న వాళ్ళతోటి, వెళ్లి వచ్చినవాళ్లను అడిగి ప్రజలకు సమాచారం ఇచ్చే అవకాశం మన మీడియా అందిపుచ్చుకోవడంలేదు. తెలంగాణ ప్రభుత్వ జీవోల వెబ్​సైట్​ల లో దావోస్ అని కొడితే 3 ఉత్తర్వులు మాత్రమే వచ్చాయి. 2019-–20లో కోటి రూపాయలు, 2021–-22లో రూ.6.07 కోట్లు, 2022–-23లో రూ.3.42 కోట్లు అదనపు ఖర్చుకు ఇస్తున్నట్లు ఉత్తర్వులు ఉన్నాయి. 

ఇప్పుడు 2024–-25లో రూ.12.30 కోట్లు ఖర్చుకు విడుదల చేసినట్లు వార్తలు చూస్తున్నాం. దాదాపు 7-8 సంవత్సరాల నుంచి తెలంగాణా రాష్ట్రం తరఫున ఒక బృందం ఈ సమావేశాలకు పోతున్నది. ఆ ఖర్చులు, జమ బందీ ఎంత అనేది ఒక అంశం కాగా ఒక బృందం ప్రతి యేడు పోవడంవల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమిటి అనే ప్రశ్న మిగిలింది.  ఆసక్తికరంగా, ఒక తెలంగాణా అధికారి మాత్రం ఈ ప్రభుత్వ బృంద యాత్రలో కీలకపాత్ర వహిస్తున్నాడు. బహుశా, ఈ అధికారికి ఆదిలాబాదు పట్టణం ఎక్కడ ఉందో, ఎట్లా ఉందో తెలియకపోవచ్చు కాని దావోస్ మాత్రం పూర్తిగా తెలిసి ఉంటుంది. ప్రభుత్వం మారినా అయన పదవి మారకపోవడానికి ప్రధాన కారణం ఆయనకు ఇక్కడ ఉన్న పరిచయాలే. అపరిచిత వాతావరణంలో జరిగే సమావేశాలలో అన్నీ దగ్గర ఉండి చూసుకునే సత్తా ఉంది కనుక అయన జీవితకాలం ఇదే పని మీద ఉన్నా ఆశ్చర్యపోనక్కరలేదు. 

తలసరి ఆదాయం పెరిగిన తెలంగాణలో పెట్టుబడులు దొరకవా?
పెట్టుబడులు దావోస్ నుంచే వస్తాయా? మన దేశంలో పెట్టుబడులు సమకూరవా? ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణలో తలసరి ఆదాయం పెరిగింది – అది దాదాపు రూ.3.93 లక్షలు అయ్యింది. మరి, ఈ ఆదాయం ఎక్కడకు పోతున్నది? ఇది పెట్టుబడిగా మారుతున్నదా? తెలంగాణ  ప్రభుత్వం సొంత గడ్డపై ఉన్న ‘డబ్బుల’ మూటలను ఎందుకు విస్మరిస్తున్నది? తెలంగాణ రాష్ట్రం 2011–-12 నుంచి 2023–-24 మధ్య సాధించిన స్థూల వస్తు, సేవల ఆదాయం కూడితే రూ.104 లక్షల కోట్లు వచ్చింది. 2024-–25లో స్థూల రాష్ట్ర ఆదాయం అంచనా రూ.15,67,324 కోట్లు. ఇంత ఆదాయం ఉన్నది అని ఘనంగా చెబుతున్న ప్రభుత్వాధినేతలు దీనినే పెట్టుబడిగా ఎందుకు మలచడం లేదు? ఈ సంపద పెట్టుబడిగా మారకుండా ఎక్కడికి పోతున్నది? ఇందులో కేవలం 1 శాతం పెట్టుబడిగా తిరిగి వస్తే, ప్రభుత్వం ముందట ఉండే డబ్బు మూట విలువ దాదాపు రూ.1 లక్ష కోట్లు.

తెలంగాణ ప్రజల మధ్య ఉన్న ఇటువంటి సొమ్మును పెట్టుబడిగా మార్చే ఆలోచన చేయకుండా విదేశాలకు వెళ్ళడం సమంజసనీయంగా లేదు. ప్రతి యేటా సృష్టిస్తున్న సంపద, పెరుగుతున్న ఆదాయం పెట్టుబడిగా తిరిగి వస్తున్నదా? వస్తే పెట్టుబడుల కొరకు ప్రభుత్వాధినేతలు ఇంతగా వెంపర్లాడే పని ఉండదు కదా. జీడీపీ లెక్కలు నిజమైతే, వస్తున్న ఆదాయం మొత్తం కాకపోయినా కొంతైనా పెట్టుబడిగా మారాలి. మారుతున్నట్లు లేదు. ఎక్కడికో తరలిపోతున్నట్టున్నది. లేదా ఉత్పత్తి నుంచి ఇంకొక రంగానికి మరలుతున్నది. భూముల మీద పెట్టుబడి ఎక్కువ అయ్యింది. ఊహాజనిత పెట్టుబడులకు భూమి కేంద్రంగా మారింది. భూములు కొనడం పడావు పెట్టడం.

దోపిడీ పెట్టుబడులు వద్దు, ఉన్న నైపుణ్యాలపై పెట్టుబడులు కావాలి
వ్యవసాయం తీసుకుంటే వ్యవసాయ ఉత్పత్తుల విలువ పెరుగుతున్నది.  లక్షలాది చిన్న, సన్నకారు రైతులు. వాళ్ళ పెట్టుబడికి తగిన ఆదాయం రావడం లేదు. సగటు రైతు అప్పులలో ఉన్నాడు. అందుకే గత అయిదు ఏండ్లలోనే రెండు సార్లు రుణమాఫీ ప్రకటించాల్సి వచ్చింది. ఇంకొక వైపు చూస్తే గ్రామీణ వ్యవసాయ కూలీలకు పని దొరకడం లేదు. కూలీలు లేని వ్యవసాయ ఉత్పత్తి వ్యవస్థకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నది. గ్రామీణ నిరుద్యోగం పోవాలంటే కూలీలకు పని కల్పించే వ్యవసాయ పెట్టుబడులకు, ఉత్పత్తి విధానాల రూపకల్పన అవసరం ఉన్నది.

ప్రకృతి వ్యవసాయం మీద ఒక విధానం ప్రకటిస్తే పెట్టుబడులు పెరగడంతో పాటు ఉపాధి పెరుగుతుంది. తెలంగాణలో యువతకు ఆ నైపుణ్యాలు నేర్పించడం ఒక మార్గం అయితే యువతకు ఉన్న నైపుణ్యం బట్టి పరిశ్రమలు తీసుకురావడం కూడా ఒక మార్గం. ఈ రెండు మార్గాల మీద ఆలోచన లేని ప్రభుత్వాధినేతలు మేము తాయిలాల సూటుకేసు ఇస్తాం మీరు సూటుకేసు తీసుకురండి అంటూ దావోస్ లో బిచ్చం ఎత్తుకుంటున్నారు. ఒక రకంగా శ్రమ, వనరుల దోపిడీ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నారు. పని కల్పించే పెట్టుబడులను, వనరులను సుస్థిరంగా ఉపయోగించే పెట్టుబడుల గురించి ఆలోచన కూడా చేయడంలేదు.

ఉన్న ఉపాధిని కొల్లగొడుతున్నారు
AICTE డేటా, CMIE నివేదికల ప్రకారం, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు (2019లో 58%), మొత్తం గ్రాడ్యుయేట్లు (2021లో 25%) నిరుద్యోగులుగా ఉన్నారు. గ్రాడ్యుయేట్లలో తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగం రేటు (సెప్టెంబర్- డిసెంబర్ 2020లో 21.88%) జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. తెలంగాణలో ఉన్న వస్తు ఉత్పత్తి, సేవల వ్యవస్థ ఇక్కడ నిరుద్యోగం తగ్గించే విధంగా అభివృద్ధి కావడం లేదు.  యువతలోనే కాదు. మధ్య వయస్కులలో కూడా ఉపాధి లేదు. గ్రామాలలో ఎక్కువగా బీడీ కార్మికులుగా, నిర్మాణ రంగం కార్మికులుగా మారుతున్నారు.

చేనేత మీద ఆధారపడిన దాదాపు 5 లక్షల కుటుంబాలు ఈ పది సంవత్సరాలలో ఆ వృత్తిని వదిలిపెట్టి పోయినారు. ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం దీని మీద ఆధారపడిన కుటుంబాలు 50 వేల లోపే ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు. తగిన విధానాలు తేవడం లేదు. వృత్తిని, ఉపాధిని, ఉద్యోగాలను కల్పిస్తున్న రంగాల మీద ప్రభుత్వ పెట్టుబడులు లేవు. విధానాలు అసలే లేవు. పైగా వీటిని హరిస్తున్న పరిశ్రమలకు తాయిలాలు ఇచ్చి మరీ ప్రోత్సహిస్తున్నారు. 

పారదర్శకత లోపించిన ఆర్థిక వ్యవస్థ వల్ల అంతటా అప్పులే
తెలంగాణలో పారదర్శకంగా ఆర్ధిక వ్యవస్థను సమీక్షించకపోవడం అతి పెద్ద లోపం. ప్రకృతి వనరుల మీద ఆధారపడిన ఆర్థికాభివృద్ధి గాడి తప్పింది అనడానికి నిదర్శనం పెరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వ అప్పులు. ప్రైవేటు అప్పులు కూడా జత అయినాయి. సగటు రైతుతో సహా సాఫ్ట్ వేర్ పరిశ్రమలో పని చేసే సగటు వేతన జీవి కూడా అప్పులతోనే జీవితాలు నడిపిస్తున్నారు.


పాలసీ వాచ్​: - డా. దొంతి నర్సింహారెడ్డి