New Zealand Cricket: కొకైన్ వాడినందుకు న్యూజిలాండ్ క్రికెటర్‌పై నిషేధం

న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ డగ్ బ్రేస్‌వెల్ కొకైన్ వాడినట్లు తేలినందుకు అతనిపై ఒక నెల నిషేధం పడింది. 34 ఏళ్ల బ్రేస్‌వెల్.. ఈ ఏడాది జనవరిలో కొకైన్ వాడినట్లు తేలింది. వెల్లింగ్టన్‌, సెంట్రల్ డిస్ట్రిక్ట్‌ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్ లో అతను ఈ నిషేధిత పదార్ధం వాడినట్టు రుజువు కాబడింది. ఈ మ్యాచ్ లో బ్రేస్‌వెల్ ఆల్ రౌండ్ షో తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. బౌలింగ్ లో రెండు వికెట్లు పడగొట్టిన అతను బ్యాటింగ్ లో కేవలం 11 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు. వీటితో పాటు రెండు క్యాచ్ లను అందుకున్నాడు. 

Also Read : విండీస్‌ ఓపెనర్ల ఊచకోత

న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్కాట్ వీనింక్ మాట్లాడుతూ.. బ్రేస్‌వెల్ తన ప్రతిష్ట పోగొట్టుకోవడంతో పాటు న్యూజిలాండ్ క్రికెట్ ప్రతిష్టను దిగజార్చాడని విచారం వ్యక్తం చేశాడు. బ్రేస్‌వెల్‌కు గతంలో మద్యం సేవించి డ్రైవింగ్ చేసిన నేరారోపణ ఉంది. ఈ కారణంగా అతను 12 నెలల పాటు డ్రైవింగ్ చేయడానికి అనర్హుడయ్యాడు.  బ్రేస్‌వెల్ న్యూజిలాండ్ తరఫున 28 టెస్టులు, 21 వన్డేలు, 20 టీ20 మ్యాచ్ లు ఆడాడు. అతను 2023లో శ్రీలంకతో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.