- ఏషియన్ మాల్, న్యూశాయంపేటలో ఖాళీగానే దాదాపు 1300 ఇండ్లు
- అప్పట్లో.. ఇండ్లకు డబ్బులు వసూలు చేయడంతో ఆగిన పంపిణీ
- సంక్రాంతికి లబ్ధిదారులకు ఇండ్లు అప్పజెప్పేందుకు సర్కారు సిద్ధం
- స్థానిక బాధితులు, ఒక్కో డివిజన్ నుంచి 40 మంది అర్హుల ఎంపిక
- మిగతా లబ్ధిదారులకు ఇందిరమ్మ పథకంలో అవకాశం
- లాటరీ సిస్టం ద్వారా ఇండ్ల పంపిణీ యోచన
వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్ లో నాలుగేళ్ల క్రితం నిర్మాణం పూర్తి చేసుకున్న డబుల్ బెడ్‍రూం ఇండ్లకు మోక్షం కలగనుంది. వందల కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఇండ్లను అప్పట్లో కొందరు ప్రజాప్రతినిధులు వారి అనుచరులు బేరాలు పెట్టి డబ్బులు వసూలు చేయడంతో కట్టిన ఇండ్లను సైతం జనాలకు ఇవ్వలేకపోయారు.
ఈ క్రమంలో రాబోయే సంక్రాంతి పండుగకు అర్హులైన లబ్ధిదారులకు వీటిని పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున లోకల్ లీడర్లు, అధికారులు సిద్ధం అవుతున్నారు. గతంలో జరిగిన అవినీతి, అక్రమాలు, రాజకీయాలకు తావులేకుండా అర్హులైన వారికే వీటిని కేటాయించేలా అడుగులు వేస్తున్నారు. దీనికోసం డివిజన్ల వారీగా స్పెషల్ అధికారిలను నియమించారు. అర్హుల రిపోర్ట్ రాగానే లాటరీ సిస్టం ద్వారా లబ్ధిదారులకు కేటాయించనున్నారు.
Also Read : ఇంకో ఐదేళ్లలో 3 కోట్ల 12 లక్షలు ఇండ్లు కావాలి
గుడిసెలు పోయినోళ్లు.. డివిజన్ల వారీగా ఎంపిక
గ్రేటర్ వరంగల్ పశ్చిమ పరిధిలోని మొదటి దశలో ఇందిరమ్మ పథకంతో సంబంధం లేకుండా అందుబాటులో ఉన్న 1300 ఇండ్లను పంపిణీ చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి అధికారులతో ఇప్పటికే పలుమార్లు రివ్యూ నిర్వహించారు. హనుమకొండ బస్టాండ్ ఏషియన్ మాల్ పక్కనే ఉన్న 594 డబుల్ బెడ్‍రూం ఇండ్లతో పాటు హంటర్‍రోడ్ దగ్గర్లోని న్యూ శాయంపేట పరిధిలోని అటుఇటుగా రెడీగా ఉన్న మరో 600 డబుల్ ఇండ్లను సంక్రాతి పండుగకు అర్హులైన పేదలకు పంచాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇందులో ప్రధానంగా రెండూచోట్ల డబుల్ ఇండ్ల నిర్మాణం చేపట్టే క్రమంలో గుడిసెలు కోల్పోయినవారి అసలు జాబితా అధికారుల వద్ద ఉండటంతో వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఆపై పశ్చిమ పరిధిలో ఉన్న 26 డివిజన్ల నుంచి వచ్చిన ఇండ్లులేని పేదల జాబితా నుంచి 40 మందికి అటుఇటుగా ప్రయారిటీ ఆధారంగా అర్హులను ఎంపిక చేయనున్నారు. ఈ క్రమంలో అధికారులు, మీడియా సమక్షంలో లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు వాటిని కేటాయించనున్నట్లు తెలిపారు. మిగతావారందరికీ ఇందిరమ్మ పథకంలో అవకాశం ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నారు.
9 ఏండ్లుగా ఫ్లెక్సీలు, పరదాలే వారి ఇండ్లు
తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ వరంగల్ నగర పర్యటన సందర్భంగా ప్రస్తుత ఏషియన్ మాల్ పక్కనే ఉన్న అంబేద్కర్ నగర్, జితేందర్‍సింగ్ గుడిసెవాసుల కాలనీలో పర్యటించారు. ఏడాదిలోగా గుడిసెల స్థానంలో అందరికి డబుల్ బెడ్‍రూం ఇండ్లు కట్టిస్తానని..కల్లు, గుడాలతో దావత్ ఇవ్వాలని చెప్పివెళ్లారు. దీంతో అప్పట్లో అక్కడున్న దాదాపు 250 ఇండ్లను తొలగించి 594 డబుల్ ఇండ్ల నిర్మాణం మొదలుపెట్టారు. కాగా, గుడిసెలు ఖాళీ చేసిన పేదలకు కిరాయి కట్టే స్తోమత లేకపోవడంతో ఇవే డబుల్ ఇండ్ల చుట్టూరా ఫ్లెక్సీలు, పరదాలతో కూడిన చిన్నపాటి గుడిసెల్లో పిల్లపాపలతో 09 ఏండ్లుగా ఉంటున్నారు.
ఏడాదని చెప్పి నత్తనడక పనులు చేపట్టిన బీఆర్‍ఎస్ ప్రభుత్వం మొత్తంగా 2021లో ఇండ్ల నిర్మాణం దాదాపు పూర్తి చేసింది. అదే సమయంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రావడంతో డబుల్ ఇండ్ల పంపిణీ ఉంటుందని చెప్పినా.. అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్‍తో రిబ్బన్ కట్ చేయించారు తప్పితే లబ్ధిదారులకు ఇండ్లివ్వలేదు. పేదలు పలుమార్లు తాళాలు పగలగొట్టి డబుల్ ఇండ్లను ఆక్రమించుకునే ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు.
పైసల వసూళ్లతో ఆగిన పంపిణీ
మాములుగా ఏవైనా ఎలక్షన్లు వస్తున్నాయంటే అమలు కానీ స్కీంల పేర్లు చెప్పి ఓటర్లను బురిడి కొట్టించే రాజకీయ నేతలు ఉండగా.. ఇక్కడ మాత్రం పూర్తయిన డబుల్ బెడ్‍రూం ఇండ్లను కూడా పంపిణీ చేయలేకపోయారు. అప్పట్లో స్థానిక ప్రజాప్రతినిధులు వారి అనుచరుల రూపంలో బ్రోకర్లు ఒక్కో ఇంటికి లక్షల రూపాయల వసూలు చేశారు. మరికొందరు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ద్వారా పైరవీ లెటర్లు తెచ్చుకున్నారు.
హౌజింగ్ డిపార్టుమెంట్‌లో వీరికి అనుకూలంగా ఉండే ఓ ఉద్యోగి సైతం రూ.14 లక్షల వరకు చేశాడు. మొత్తంగా పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి. ఈ క్రమంలో అసలు లబ్ధిదారుల కంటే అక్రమ మార్గాల్లో వచ్చేవారి జాబితానే ఎక్కువైంది. దీంతో ఇండ్ల పంపిణీ చేపడితే నిజమైన లబ్ధిదారులతో పాటు డబ్బులు లంచం ఇచ్చి ఇండ్లు దక్కనివారు ఎక్కడ గొడవలకు దిగుతారోననే టెన్షన్‍తో గులాబీ నేతలు కట్టిన ఇండ్లను కూడా పంపిణీ చేయలేకపోయారనే ఆరోపణలు, విమర్శలు వినిపించాయి.