ముంబై: బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఊర్మిలా మతోండ్కర్ రీసెంట్‌గా మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివ సేన పార్టీలో చేరారు. గతేడాది ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో చేరిన ఊర్మిల.. తక్కువ టైమ్‌లోనే ఆ పార్టీని వీడి శివ సేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో తన రాజకీయ జీవితం గురించి ఆమె మాట్లాడారు. ఏసీల్లో కూర్చుని, ట్వీట్లు చేసే నాయకురాలిగా ఉండాలనుకోవడం లేదని చెప్పారు.
‘ప్రజా నాయకురాలిగా అనిపించుకోవాలనేదే నా లక్ష్యం. జనాలు నన్ను సినీ తారగా మార్చారు. అదేరీతిలో వారి ఆశీస్సులతో మంచి నేతగా ఎదగాలనుకుంటున్నా. కుల, మత తేడాలు లేకుండా ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా పని చేస్తా. ఏసీ రూముల్లో కూర్చుని, ట్వీట్లు చేసే లీడర్లలా అవ్వాలనుకోవడం లేదు. నేనేం చేయాలో, ఎలా చేయాలో నాకు తెలుసు. ఇందుకు అవసరమైన విషయాలను నేర్చుకుంటున్నా. ఏ పోస్టు కోసమో నేను శివ సేనలో జాయిన్ అవ్వలేదు. ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ చేరలేదు. కాంగ్రెస్‌కు క్యాంపెయినింగ్ చేసినా సంతోషించేదాన్ని’ అని ఊర్మిల పేర్కొన్నారు.
