కోవాగ్జిన్ వ్యాక్సిన్ పై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి.ఈ క్రమంలోనే భారత్ బయోటెక్ ఫార్మా సంస్థ ఫ్యాక్ట్ షీట్‌ను రిలీజ్ చేసింది. ఎవరు టీకా తీసుకోవాలి.. ఎవరు తీసుకోవద్దనే అంశంపై క్లారిటీ ఇచ్చింది. కరోనా టీకా తీసుకున్న వారిలో దాదాపు 580 మంది అనారోగ్యానికి గురికాగా.. ఇద్దరు చనిపోయారు. దీంతో కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఎవరు తీసుకోకుండా ఉండాలనే విషయాన్ని భారత్ బయోటెక్ ప్రకటించింది. గతంలో అలర్జీలు ఉన్నవారు, రక్త హీనత, గర్భవతులు, బిడ్డలకు పాలిచ్చే తల్లులు, తీవ్రమైన ఆనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ వ్యాక్సిన్ తీసుకోవద్దని సచించింది.
ఇదే సమయంలో కోవాగ్జిన్ కాకుండా మరో వేరియంట్ ను తీసుకున్న వారు, శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిపై ప్రభావం చూపించే మందులను వాడుతున్న వారు, జ్వరంతో బాధపడుతున్న వారు కూడా టీకాకు దూరంగా ఉండాలని తెలిపింది భారత్ బయెటెక్. వ్యాక్సిన్ తీసుకునే ముందు తమ మెడికల్ హిస్టరీని గురించి డాక్టర్లకు, వ్యాక్సిన్ ఆఫీసర్ లకు తప్పనిసరిగా తెలియజేయాలంది. వారి సలహా, సూచనలతో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
కోవాగ్జిన్ టీకాతో కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి తన ఫ్యాక్ట్ షీట్ లిస్టులో భారత్ బయోటెక్ కంపెనీ కొన్ని అంశాలు తెలిపింది. వ్యాక్సిన్ తీసుకున్న ప్రాంతంలో నొప్పి, వాపు, దురద వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒళ్లు నొప్పులు, తలనొప్పి, జ్వరం, బలహీనత, దద్దులు, నలత, వాంతులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కోవాగ్జిన్ వల్ల అలర్జీ రియాక్షన్ ఏర్పడే ప్రమాదం ఉన్న కారణంగా.. టీకా తీసుకున్న తర్వాత ఓ అరగంట పాటు వ్యాక్సిన్ సెంటర్‌లోనే ఉండాలని భారత్ బయోటెక్ సంస్థ సూచనలు చేసింది. తమ కంపెనీకి చెందిన రెండవ డోసు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత.. మూడు నెలల పాటు ఫాలోప్ ఉంటుందని భారత్ బయోటెక్ చెప్పింది.
