- బాంబే హైకోర్టుకు ఎన్‌ఐఏ వినతి
ముంబై: ప్రముఖ రచయిత, విరసం నేత వరవరరావుకు బెయిల్ ఇవ్వొద్దని బాంబే హైకోర్టుకు నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) విజ్ఞప్తి చేసింది. 2018లో ఎల్గర్ పరిషత్ కేసులో వరవరరావు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా వరవరరావుకు బెయిల్‌ను నిరాకరించాలని కోర్టును ఎన్‌ఐఏ కోరింది. అనారోగ్యంతో బాధపడుతున్న తనకు బెయిల్ ఇవ్వాలని కోర్టులో వరవరరావు పిటిషన్ వేశారు. కానీ కేసులో ఆయనకు ఉన్న ప్రాధాన్యతను బట్టి బెయిల్ ఇవ్వొద్దని కోర్టుకు ఎన్ఐఏ వివరించింది. ఈ నేపథ్యంలో వరవరరావు ఆరోగ్య పరిస్థితిపై మెడికల్ రిపోర్టును సమర్పించాలని నానావతి ఆస్పత్రిని కోర్టు ఆదేశించింది. కాగా, ఈ కేసులో రెండేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న వరవరరావు ఆరోగ్యం పలుమార్లు క్షీణించింది.
