పిల్లలు టీవీలు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు, స్మార్టఫోన్లకు అతుక్కుపోతూ తగినంత నిద్రపోకపోతే జాగ్రత్తగా ఉండాలంటున్నారు. పరిశోధకులు. ముఖ్యంగా ఏడేళ్ల లోపు పిల్లలు తగినంత నిద్రపోకపోతే పెద్దయ్యాక ఏకాగ్రత లోపించటం, భావోద్వేగాలను నియంత్రించుకోలేక పోవటం, గుర్తుంచుకోలేక పోవడం లాంటి సమస్యలు వచ్చే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమస్యలు స్కూల్లో... ఇంట్లో పిల్లల చురుకుదనం, నైపుణ్యం దెబ్బతీసేలా చేస్తాయి.
పిల్లల్లో మెదడు ఎదుగుదలలో నిద్ర చాలా కీలకపాత్ర పోషిస్తుంది. సాధారణంగా మూడు నుంచి నాలుగేళ్ల పిల్లలకు రోజుకు పదకొండు గంటలు నిద్ర అవసరం.
వయసు పెరుగుతున్న కొద్దీ నిద్ర అవసరం తగ్గుతుంటుంది. కానీ ప్రస్తుతం ఎంతోమంది పిల్లలు తగినంత నిద్రపోవటం లేదు. దానివల్ల మెదడు స్పందించే సామర్థ్యం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రపోతున్నప్పుడు మెదడు అనవసరమైన విషయాలను తీసేసి, అవసరమైన వాటిని జ్ఞాపకాలుగా స్థిరపరచుకుంటుంది. కాబట్టి పిల్లలు రాత్రిపూట తొందరగా నిద్రపోయేలా చూడటం చాలా అవసరం.