Pakistan Cricket: తిట్టిన బాధపడకు.. నిన్ను కాదనుకో: బాబర్‌కు మహ్మద్ అమీర్ మద్దతు

సొంతగడ్డపై 11 టెస్టు మ్యాచ్‌ల అనంతరం (సుమారు మూడున్నరేండ్ల తర్వాత) పాకిస్థాన్‌కు ఎట్టకేలకు ఓ విజయం దక్కిన విషయం తెలిసిందే. ముల్తాన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో పాక్ 152 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయమే ఆ జట్టు మాజీ కెప్టెన్ బాబర్ ఆజాంకు తలనొప్పిగా మారింది. అందుకు కారణం.. అతను జట్టులో లేకపోవడమే. 

ALSO READ | AFG vs BAN: బంగ్లాను ఢీకొట్టనున్న ఆఫ్ఘన్లు.. టీమ్‌లో పిల్ల బచ్చాలు

స్వదేశంలో పాక్ వరుసగా ఓడిన 11 టెస్టు మ్యాచ్‌ల్లోనూ బాబర్ ఆజాం జట్టులో ఉన్నాడు. ఇటీవల కాలంలో దారుణంగా విఫలమవుతుండంతో సెలక్టర్లు అతనికి ఉద్వాసన పలికి దేశవాళీ హీరో కమ్రాన్ గులామ్‌కు జట్టులో చోటు కల్పించారు. అతను సెలక్టర్ల నమ్మకాన్ని వమ్ము చేయలేదు. అరంగ్రేట టెస్టులోనే శతకం బాది పాక్ కు విజయాన్ని అందించాడు. దాంతో, బాబర్ జట్టులో లేకపోవడం వల్లే దాయాది దేశం విజయం సాధించిందని ఆ దేశ అభిమానులు నెట్టింట ట్రోలింగ్ మొదలు పెట్టారు.

మీరు జట్టులో లేకపోవడం వల్లే..

బాబర్ ఆజాం జట్టులో లేకపోవడం వల్లే పాక్ విజయం సాధించిందన్న ట్రోలింగ్.. ఆ దేశ మీడియా చెవిన పడగా ఆ విషయాన్ని వారింకా పెద్దది చేశారు. ఏకంగా మీడియా సమావేశంలో ఈ అంశాన్ని బాబర్ ముందుంచారు. ఆ ప్రశ్నకు మాజీ కెప్టెన్ వద్ద సమాధానమే లేకపోయింది. ఏం చెప్పాలో తెలియక మౌనం వహించాడు. జరుగుతున్న ఈ పరిణామాలపై తాజాగా ఆ జట్టు పేసర్ మహమ్మద్ అమీర్ స్పందించాడు. బాబర్ ఆజాంకు మద్దతుగా నిలిచాడు. క్రికెటర్లను వ్యక్తిగతంగా దూషిస్తున్న అభిమానులను అమీర్ చురకలు అంటించాడు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడి ఆటగాళ్లను బాధపెట్టొద్దని హితవు పలికాడు.

విజయం కోసమే ఆడతాం..

"దయచేసి జట్టు గెలిచిన బాబర్ జట్టులో భాగం కాలేదన్న మీ హాస్యాస్పదమైన మనస్తత్వాన్ని వదిలించుకోండి. మేము మెరుగైన ప్రణాళికతో ఆడాం. పరిస్థితులను సద్వినియోగం చేసుకున్నాం. విజయం సాధించాం. ఒక ఆటగాడు జట్టులో ఉన్నా.. లేకపోయినా ప్రదర్శన మారదు. విజయం కోసమే ఆడతాం. ఆటగాడిని వ్యక్తిగతంగా కించపరచకండి.. ప్రదర్శన గురించి మాట్లాడండి.." అని అమీర్ ట్రోలర్లకు సూచించాడు. అదే సమయంలో అసహ్యించుకునే వారు అనే మాటలు పట్టించుకోవద్దని బాబర్‌కు సలహా ఇచ్చాడు. వీలైనంత వరకు విమర్శకులకు దూరంగా ఉండమని అతనికి సూచించాడు.

ఇక పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య అక్టోబరు 24 నుంచి రావల్పిండి వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది.