డీహైడ్రేట్​ కావద్దు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

డీహైడ్రేట్​ కావద్దు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

సాధారణంగా పీరియడ్స్ టైంలో ఆడవాళ్లు పొత్తికడుపు నొప్పి, అధిక రక్తస్రావం (హెవీ బ్లీడింగ్) వంటి సమస్యలతో చాలా ఇబ్బంది పడుతుంటారు. అయితే, ఇవేకాకుండా పీరియడ్స్ టైంలో వాడే శానిటరీ ప్యాడ్స్, వేసుకునే బట్టల వల్ల కూడా కొన్ని సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యలను గుర్తించి, బయటపడాలి అని చెప్తున్నారు సీనియర్​ గైనకాలజిస్ట్ పి. బాలాంబ.

పీరియడ్స్ టైంలో శానిటరీ ప్యాడ్స్​ని నాలుగ్గంటలకు ఒకసారి మారుస్తుండాలి. అలాకాకుండా ఎక్కువ టైం మార్చకపోతే ప్యాడ్స్ ఎండిపోతాయి. దానివల్ల తొడలకు రాసుకుని, దురద వస్తుంది. దురద వస్తుందని గోర్లతో గీరితే, మంట పుడుతుంది. అప్పటికీ జాగ్రత్తలు తీసుకోకపోతే దురద వచ్చిన ఏరియాలో పుండ్లు పుట్టుకొస్తాయి. దాంతో సమస్య పెద్దదవుతుంది. చిన్నపాటి జాగ్రత్తలతో పోగొట్టుకోవాల్సిన సమస్యకు వారం, పదిరోజులు ట్రీట్​మెంట్​ చేయాల్సి వస్తుంది.

ఇలాంటి పరిస్థితి ఎక్కువగా టీనేజర్స్​లో కనిపిస్తుంటుంది. పైగా ఇప్పుడు పరీక్షల టైం కావడంతో చదువుకునేటప్పుడు, ఎగ్జామ్​ రాసేటప్పుడు ఎక్కువసేపు కూర్చుని ఉండాల్సి వస్తుంది. దాంతో టైంకి ప్యాడ్స్​ మార్చకపోవడంతో దురద వంటి సమస్యలు వస్తున్నాయి. అయితే ఈమధ్య మెనుస్ట్రువల్​ కప్స్ వాడకం పెరిగింది. ఇవి వాడితే శానిటరీ న్యాప్​కిన్​ వాడినప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ రావు. 

శానిటరీ ప్యాడ్స్​ వల్ల వచ్చే దురదలాంటి సమస్యలు టీనేజ్​​ అమ్మాయిలకే కాకుండా మధ్యవయసు వాళ్లలో కూడా కనిపిస్తుంది. అందుకు ముఖ్య కారణం శానిటరీ ప్యాడ్స్ తరచూ మార్చకపోవడం ఒకటైతే... ఫ్యాషన్​ పేరుతో గాలి తగలకుండా ఒంటికి అతుక్కుపోయే బట్టలు వేసుకోవడం రెండోది. బట్టలంటే పైన వేసుకునే టీ షర్ట్, జీన్స్, లెగ్గిన్స్.. మాత్రమే కాదు. లోపల వేసుకునే పెట్టికోట్​, బ్రా, అండర్ వేర్​లు కూడా వస్తాయి. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వేసవి అయినా కాకపోయినా... వదులుగా ఉండే బట్టలు వేసుకోవాలి. లేదంటే నడుము, తొడల భాగంలో చెమట పట్టి తడి వల్ల చిరాకుపుడుతుంది. మెనుస్ట్రువల్​ పీరియడ్​ టైంలో ఒక పక్క బ్లీడింగ్​ అవుతుంటే, దానికితోడు చెమట పడితే మరో ఇబ్బంది తెచ్చిపెడుతుంది. అందుకని వదులుగా ఉండే బట్టలు వేసుకుంటే ఆ సమస్య ఉండదు.  వేసవిలో అయితే వదులుగా ఉండే కాటన్ బట్టలు వాడాలి. అండర్​వేర్​తో సహా అన్నీ కాటన్​వే వాడాలి. లైట్ కలర్ డ్రెస్​లు వేసుకుంటే ఎండ నుంచి వేడి గ్రహించవు. దాంతో శరీరానికి ఎక్కువ వేడి తగలకుండా చల్లదనాన్నిస్తాయి. మామూలు రోజుల్లోనైనా, పీరియడ్స్ టైంలోనైనా, ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైంలో వదులుగా ఉండే కాటన్ బట్టలు వేసుకోవడమే ఉత్తమం.

శీతాకాలంలో వెచ్చదనం కోసం బిగుతుగా ఉండే బట్టలు వేసుకోవడం మామూలే. పైగా సింథటిక్ బట్టలు వేసుకోవడం వల్ల అవి ఒంటికి అతుక్కుపోతాయి. అప్పుడు గాలి తగలక ఇరిటేషన్, ర్యాష్​​ వంటివి వస్తాయి.  ఎండిపోయిన ప్యాడ్స్ తొడలకు రాసుకుపోయినప్పుడు ఫంగస్ పెరిగి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. దాంతో దురద పెడుతుంది. మంట పుడుతుంది. పుండ్లు ఏర్పడతాయి. అలాంటప్పుడు ట్రీట్​మెంట్ కోసం డెర్మటాలజిస్ట్​ లేదా గైనకాలజిస్ట్​ దగ్గరకి వెళ్లాలి.

డీహైడ్రేషన్ కోసం..

పీరియడ్స్ టైంలో శరీరంలో వేడి ఎక్కువగా ఉండడం వల్ల డీహైడ్రేషన్​ ప్రాబ్లమ్ వస్తుంది. వేసవిలో వాతావరణంలో కూడా వేడి స్థాయిలు విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి డీహైడ్రేషన్ ప్రాబ్లమ్​ ఎక్కువ అనిపిస్తుంది. అందుకని ఎక్కువసార్లు నీళ్లు తాగుతూ హైడ్రేటెడ్​గా ఉండాలి. అలా ఉంటేనే శరీరంలో వేడి తగ్గుతుంది. ఎక్కువసార్లు నీళ్లు తాగలేకపోతుంటే కనుక కొబ్బరి నీళ్లు, ఫ్రూట్ జ్యూస్​ వంటివి తాగొచ్చు. ఎనిమిది నుంచి పది వారాల్లోపు గర్భిణులు అస్సలంటే అస్సలు డీహైడ్రేట్​ కాకూడదు. ఎందుకంటే ఆ టైంలో శిశువు హార్ట్ బీట్ తగ్గిపోయే ప్రమాదం ఉంది.