- 3,70,786 వెహికల్స్ అమ్మకం
న్యూఢిల్లీ : యుటిలిటీ వాహనాలకు బలమైన డిమాండ్ కారణంగా మనదేశంలో ప్రయాణీకుల వాహనాల టోకు విక్రయాలు ఫిబ్రవరిలో ఏడాది ప్రాతిపదికన 11 శాతం పెరిగాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) మంగళవారం తెలిపింది. గత నెలలో డీలర్లకు మొత్తం 3,70,786 ప్యాసింజర్ వాహనాలను డిస్పాచ్ (పంపకాలు) చేశారు. గత ఏడాది కాలంలో ఇది 3,34,790 యూనిట్లు డిస్పాచ్ అయ్యాయని సియామ్ తెలిపింది. యుటిలిటీ వాహనాల విక్రయాలు ఫిబ్రవరిలో 38 శాతం పెరిగి 1,91,435 యూనిట్లకు చేరుకోగా, గత ఏడాది ఇదే నెలలో 1,38,238 యూనిట్లుగా ఉన్నాయి.
అయితే ప్యాసింజర్ కార్ల హోల్‌సేల్స్ గత నెలలో 18 శాతం క్షీణించి 1,15,937 యూనిట్లకు పడిపోయాయి. ఫిబ్రవరి 2023లో 1,42,201 యూనిట్లు అమ్ముడయ్యాయి. వ్యాన్ డిస్పాచ్‌లు గతేడాది ఇదే నెలలో 11,489 యూనిట్లు ఉండగా, గత నెలలో 12,147 యూనిట్లకు పెరిగాయి. ప్యాసింజర్ వాహనాలు ఫిబ్రవరి 2023తో పోలిస్తే 10.8 శాతం వృద్ధితో 3.7 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేశాయని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ తెలిపారు.
మారుతి నంబర్‌వన్
మారుతీ సుజుకి గత నెలలో 1,60,271 యూనిట్లను డీలర్లకు పంపి ఈ విభాగంలో నంబర్‌వన్‌గా నిలిచింది. ఇది ఫిబ్రవరి 2023లో 1,47,467 యూనిట్ల హోల్‌సేల్స్‌ను సాధించింది. హ్యుందాయ్ 50,201 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది ఇది 47,001 యూనిట్లను అమ్మింది. ఫిబ్రవరిలో మొత్తం టూవీలర్ టోకు విక్రయాలు 35 శాతం పెరిగి 15,20,761 యూనిట్లకు చేరుకోగా, గత ఏడాది ఇదే నెలలో 11,29,661 యూనిట్లు ఉన్నాయి. స్కూటర్ డిస్పాచ్‌లు గత నెలలో 3,91,054 యూనిట్ల నుంచి 5,15,340 యూనిట్లకు పెరిగాయి.
మోటార్‌సైకిల్ హోల్‌సేల్స్ 7,03,261 యూనిట్ల నుంచి 9,64,362 యూనిట్లకు పెరిగాయి.త్రీవీలర్ అమ్మకాలు 50,382 యూనిట్ల నుంచి 54,584 యూనిట్లకు పెరిగాయి. 2023–-24 మూడవ త్రైమాసికంలో బలమైన జీడీపీ వృద్ధి ఆటో రంగానికి సహాయపడిందని సియామ్తెలిపింది. ఆటోమొబైల్ రిటైల్ అమ్మకాలు ఫిబ్రవరిలో ఏడాది ప్రాతిపదికన 13 శాతం పెరిగాయని ఈ సంస్థ వెల్లడించింది.
