గ్లోబల్‌గా తగ్గిన ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు భయాలు
బిజినెస్ డెస్క్, వెలుగు: ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు భయాలు తగ్గడంతో గ్లోబల్ మార్కెట్‌లతో పాటే దేశ మార్కెట్‌లు కూడా సోమవారం ర్యాలీ చేశాయి. బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు వరసగా మూడో సెషన్‌లోనూ పెరుగుతూ సోమవారం కీలక లెవెల్స్‌ను క్రాస్ చేయగలిగాయి. సెన్సెక్స్ 787 పాయింట్లు లాభపడి 60,747 (1.37 శాతం) వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 225 పాయింట్లు పెరిగి 18,012 లెవెల్ వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ, సన్ ఫార్మా, ఎం అండ్ ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, లార్సెన్ అండ్ టుబ్రో, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. డా. రెడ్డీస్, ఎన్‌టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 31 పైసలు తగ్గి 82.78 వద్ద సెటిలయ్యింది. గ్లోబల్ మార్కెట్‌ల విషయానికొస్తే సియోల్, టోక్యో మార్కెట్‌లు లాభాల్లో క్లోజవ్వగా, షాంఘై, హాంకాంగ్ మార్కెట్‌లు నష్టాల్లో ముగిశాయి. యూరప్‌లోని మెజార్టీ స్టాక్ ఎక్స్చేంజిలు మిశ్రమంగా కదిలాయి. బ్రెంట్ క్రూడాయిల్ రేటు సోమవారం 95.47 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది.
ఎనలిస్టులు ఎమంటున్నారంటే?
1) ‘ఈ వారం జరిగే పాలసీ మీటింగ్‌లో వడ్డీ రేట్లను ఫెడ్ తక్కువగా పెంచుతుందని ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు. రేట్ల పెంపు ఎక్కువగా ఉండొచ్చని గతంలో భావించారు. గ్లోబల్‌గా సానుకూలత పెరగడంతో లోకల్ బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు కీలక సైకలాజికల్ లెవెల్స్‌ను క్రాస్ చేయగలిగాయి’ అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ (రిటైల్) హెడ్ శ్రీకాంత్ చౌహాన్ అన్నారు. లోకల్ షేర్లపై విదేశీ ఇన్వెస్టర్ల ఆసక్తి పెరిగిందని, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడుతోందని పేర్కొన్నారు. ఫెడ్ వడ్డీ రేట్లను ఎక్కువగా పెంచితే సమీప కాలంలో మార్కెట్‌లు భారీగా పడతాయని అభిప్రాయపడ్డారు. 2) యూఎస్ మార్కెట్‌లు లాభాల్లో ట్రేడవ్వడంతో మన మార్కెట్‌లు కూడా పెరిగాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. క్రూడాయిల్ ధరలు తగ్గడం, చైనా ఫ్యాక్టరీ డేటా బలహీనంగా ఉండడం మార్కెట్‌కు సపోర్ట్‌గా నిలిచిందని చెప్పారు. ‘వడ్డీ రేట్లను ఫెడ్ తక్కువగా పెంచుతుందనే అంచనాలతో భారీగా నష్టపోయిన టెక్ షేర్లు రికవరీ అయ్యాయి’ అని పేర్కొన్నారు. 3) మార్కెట్ పెరగడానికి ప్రధాన కారణం యూఎస్ ఎకనామీ రికవరీ సంకేతాలను చూపిస్తుండడమేనని ఎనలిస్ట్ వీకే విజయకుమార్ అన్నారు. యూఎస్ ఎకానమీ షార్ట్ టెర్మ్‌లో రెసిషన్‌లోకి జారుకోకపోవచ్చన్నారు.
లాంగ్‌టర్మ్‌కు మిడ్‌క్యాప్ షేర్లే బెటర్..
సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) విధానంలో లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు మిడ్ క్యాప్ షేర్లపై దృష్టి పెట్టాలని మ్యూచువల్ ఫండ్ కంపెనీ వైట్ ఓక్ ఏఎంసీ ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. లార్జ్ క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్‌లను పోలిస్తే లాంగ్ టెర్మ్‌లో మిడ్ క్యాప్ సెగ్మెంటే మంచి రిటర్న్స్‌ను ఇస్తోందని వివరించింది. గత పదేళ్ల మంత్లీ రోలింగ్ రిటర్న్స్ (యాన్యులైజ్డ్ మంత్లీ రిటర్న్స్) ను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతోందని తెలిపింది. మంత్లీ, వీక్లీ, డైలీ..ఎలా సిప్ చేసినా వచ్చే రిటర్న్స్‌లో పెద్దగా తేడా లేదని ఈ సంస్థ పేర్కొంది.
పెరిగిన ఫిస్కల్ డెఫిసిట్..
పూర్తి ఏడాదికి గాను బడ్జెట్‌లో వేసుకున్న ఫిస్కల్ డెఫిసిట్ అంచనాల్లో 37.3 శాతాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో చేరుకున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఖర్చులు, ఆదాయం మధ్య తేడా (ఫిస్కల్ డెఫిసిట్) ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య రూ.6,19,849 కోట్లకు చేరుకుంది. కిందటి ఆర్థిక సంవత్సరం ఇదే టైమ్‌లో ఫిస్కల్ డెఫిసిట్ బడ్జెట్ అంచనాల్లో 35 శాతంగా నమోదయ్యింది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంటెంట్స్ (సీజీఏ) విడుదల చేసిన డేటా ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిసీట్‌లు, ట్యాక్స్‌ల ద్వారా రూ.12.03 లక్షల కోట్లు రాగా, ఇది 2022–23 బడ్జెట్‌లో పెట్టుకున్న అంచనాల్లో 52.7 శాతానికి సమానంగా ఉంది. ఏడాది క్రితం బడ్జెట్ అంచనాల్లో వీటి కలెక్షన్స్ 55.6 శాతంగా రికార్డయ్యాయి. ట్యాక్స్‌ల ద్వారా ప్రభుత్వం రూ.10.11 లక్షల కోట్లు సేకరించింది. ఇది బడ్జెట్ అంచనాల్లో 52.3 శాతానికి సమానం. కేంద్ర ప్రభుత్వం చేసిన ఖర్చులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.18.23 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇది బడ్జెట్ అంచనాల్లో 46.2 శాతానికి సమానం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఫిస్కల్ డెఫిసిట్ 16.61 లక్షల కోట్లుగా లేదా జీడీపీలో 6.4 శాతంగా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రభుత్వం చేసే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ పూర్తి ఏడాదికిగాను పెట్టుకున్న బడ్జెట్ అంచనాల్లో 45.7 శాతానికి పెరిగింది. కిందటేడాది ఇదే టైమ్‌లో ఈ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ బడ్జెట్ అంచనాల్లో 41.4 శాతంగా రికార్డయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొత్తం రెవెన్యూలో రూ.4.36 లక్షల కోట్లను వడ్డీ చెల్లించడానికి, రూ. 1.98 లక్షల కోట్లను మేజర్ సబ్సిడీలు ఇవ్వడానికి ప్రభుత్వం ఖర్చు చేసింది.
